త‌న బౌలింగ్‌లో సిక్స్ కొట్టాడ‌ని.. బ్యాట్స్‌మెన్‌ను కొట్టిన పాక్ బౌల‌ర్‌

Shaheen Afridi injures Bangladesh batter Afif Hossain.బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న టీ20 సిరీస్‌ను మ‌రో మ్యాచ్ మిగిలి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Nov 2021 5:52 AM GMT
త‌న బౌలింగ్‌లో సిక్స్ కొట్టాడ‌ని.. బ్యాట్స్‌మెన్‌ను కొట్టిన పాక్ బౌల‌ర్‌

బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న టీ20 సిరీస్‌ను మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే పాకిస్థాన్ జ‌ట్టు కైవ‌సం చేసుకుంది. శ‌నివారం ఢాకా వేదిక‌గా జ‌రిగిన రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 108 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఫఖర్‌ జమాన్ (57 నాటౌట్), మహ్మద్ రిజ్వాన్ (39) లు రాణించ‌డంతో స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని పాకిస్థాన్ 18.1 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు కోల్పోయి చేదించింది.

కాగా.. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ షాహిన్ షా అఫ్రిది కోపంతో కంట్రోల్ త‌ప్పాడు. త‌న బౌలింగ్‌లో బ్యాట్స్‌మెన్ సిక్స్ కొట్టాడ‌ని.. బంతిని కోపంగా బ్యాట్స్‌మెన్ పైకి బ‌లంగా విసిరాడు. బంతి.. బ్యాట్స్‌మెన్ కాలికి తాక‌డంతో నొప్పితో విల‌విల లాడాడు. వివ‌రాల్లోకి వెళితే.. బంగ్లా బ్యాటింగ్ చేస్తుండ‌గా.. మూడో ఓవ‌ర్‌ను షాహిన్ షా అప్రిది వేశాడు. ఆ ఓవ‌ర్ రెండో బంతిని బంగ్లా బ్యాట్స్‌మెన్ ఆఫిఫ్‌ హొస్సెన్ సిక్స‌ర్‌గా మ‌ల‌చాడు. దీంతో అప్రిది కోపంతో ర‌గిలిపోయాడు. మూడో బంతిని ఆఫిఫ్‌ హొస్సెన్ డిఫెన్స్ ఆడాడు. క‌నీసం ర‌న్ కోసం కూడా ప్ర‌య‌త్నించ లేదు. అయిన‌ప్ప‌టికి బంతిని అందుకున్న అఫ్రిది బ‌లంగా ఆఫిఫ్‌ హొస్సెన్ వైపు విసిరాడు. బంతి నేరుగా ఆఫిఫ్‌ హొస్సెన్ కాలిని తాకింది. బంతి తగలడంతో అఫీఫ్ క్రీజ్‌లోనే కుప్పకూలిపోయాడు.

అఫ్రిది చేసిన ప‌నికి నాన్‌స్ట్రైక్‌ ఎండ్ లో ఉన్న బ్యాట్స్‌మెన్‌తో పాటు అంపైర్లు, పాక్ ఆటగాళ్లు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ తర్వాత అఫ్రిది.. హొస్సెన్‌ దగ్గరకు వచ్చి అతన్ని పైకి లేపి సారీ అని చెప్పాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అఫ్రిది పై నెటీజ‌న్లు మండిప‌డుతున్నారు. ఆట‌లో నీ ప్ర‌తాపాన్ని చూపు అంతేకానీ.. మ‌నుషుల‌పై కాదు అంటూ విమ‌ర్శిస్తున్నారు.

Next Story
Share it