స‌చిన్ పేరిట ఉన్న‌ 30 ఏళ్ల నాటి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన అమ్మాయి

బంగ్లాదేశ్‌తో జరిగిన‌ ఐదో టీ20 ఇంటర్నేషనల్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు బ్యాట్స్‌మెన్ షఫాలీ వర్మ భారీ రికార్డు న‌మోదు చేసుకుంది

By Medi Samrat  Published on  10 May 2024 9:00 AM IST
స‌చిన్ పేరిట ఉన్న‌ 30 ఏళ్ల నాటి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన అమ్మాయి

బంగ్లాదేశ్‌తో జరిగిన‌ ఐదో టీ20 ఇంటర్నేషనల్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు బ్యాట్స్‌మెన్ షఫాలీ వర్మ భారీ రికార్డు న‌మోదు చేసుకుంది. షెఫాలీకి సిల్హెట్‌లో జ‌రిగిన మ్యాచ్‌ అంతర్జాతీయ కెరీర్‌లో 100వ మ్యాచ్. దీంతో ఆమె లెజండ‌రీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 30 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. షెఫాలీ భారత పురుషుల క్రికెట్, మహిళల క్రికెట్‌లో క‌లిపి 100వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన అతి పిన్న వయస్కురాలు.

షెఫాలీ వర్మ 20 ఏళ్ల 102 రోజుల వయసులో ఈ మైలురాయిని సాధించింది. సచిన్ టెండూల్కర్ 20 ఏళ్ల 329 రోజుల వయసులో తన 100వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అలాగే షెఫాలీ 21 సంవత్సరాల 18 రోజుల వయస్సులో తన 100వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన వెస్టిండీస్‌కు చెందిన షమైన్ క్యాంప్‌బెల్ రాకార్డును కూడా బ్రేక్ చేసింది.

బంగ్లాదేశ్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో షెఫాలీ బ్యాట్ పెద్దగా రాణించలేదు. ఆమె 14 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేయగలిగింది. బంగ్లాదేశ్‌తో జరిగిన T20 సిరీస్‌లో షెఫాలీ 5 ఇన్నింగ్స్‌లలో 19.60 సగటుతో 98 పరుగులు చేసింది.

ఐదో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళా క్రికెట్ జట్టు 5 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత మహిళల జట్టు తరఫున రాధా యాదవ్ మూడు వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేసింది. రాధా యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది.

Next Story