ఏడుగురు బ్యాడ్మింటన్ ఆటగాళ్లకు కరోనా పాజిటివ్
Seven players test positive to covid-19 at yonex sunrise india open 2022.యోనెక్స్-సన్‌రైజ్ ఇండియా ఓపెన్ 2022 టోర్నీలో
By తోట వంశీ కుమార్ Published on 13 Jan 2022 5:31 AM GMTయోనెక్స్-సన్‌రైజ్ ఇండియా ఓపెన్ 2022 టోర్నీలో కరోనా కలకలం రేపింది. ఏడుగురు బ్యాడ్మింటన్ ఆటగాళ్లు కరోనా వైరస్ బారిన పడ్డారు. మాజీ ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్, కామన్‌వెల్త్ గేమ్స్‌లో రెండు సార్లు బంగారు పతకాలు సాధించిన అశ్విని పొనప్ప, రితికా రాహుల్ థ్కర్, ట్రీసా జాలీ, మిథున్ మంజునాథ్, సిమ్రాన్ అమన్ సింగ్, ఖుషీ గుప్తాలకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్) గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుతం వీరంతా ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. ఏడుగురు ఆటగాళ్లతో పాటు వీరితో సన్నిహిత సంబంధాలున్న వారిని కూడా టోర్నమెంట్ నుంచి ఉపసంహరించుకున్నట్లు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ తెలిపింది. వీరి స్థానంలో వేరే ఆటగాళ్లను తీసుకోవడం లేదని దీంతో వారి ప్రత్యర్థులు నేరుగా తదుపరి రౌండ్లకు అర్హత సాధిస్తారని బీడబ్ల్యూఎఫ్ తెలిపింది. ఈ విషయాన్ని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బీఏఐ) ధ్రువీకరించింది.
జనవరి 11 న యోనెక్స్-సన్‌రైజ్ ఇండియా ఓపెన్ 2022 టోర్నీ ప్రారంభమైంది. నేటి(గురువారం) నుంచి రెండో దశ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏడుగురు ఆటగాళ్లకు వైరస్ సోకింది. అంతకముందు సాయి ప్రణీత్‌కు సైతం కరోనా బారిన పడడంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఇంగ్లాండ్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లకు కూడా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో టోర్నీ నుంచి ఇంగ్లాండ్ జట్టు తప్పుకుంది. దీంతో ప్రస్తుతం ఈ టోర్నీ నిర్వహణపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. టోర్నీని రద్దు చేస్తారా..? లేదా కొనసాగిస్తారా..? అన్నది తెలియాల్సి ఉంది.