టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీకి కోల్‌కతా హైకోర్టు షాకిచ్చింది. మాజీ భార్య హసీన్ జహన్‌కు భరణం కింద ప్రతీ నెలా రూ.1.30లక్షల చెల్లించాలని ఆదేశించింది. ఇందులో రూ.50వేలు హసీన్‌కు కాగా మిగిలిన రూ.80వేలు వారి కూతురు పోషణ కోసం ఇవ్వాలని అలీపూర్ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
2014లో హసీన్-షమీ పెళ్లి చేసుకున్నారు. కొద్ది కాలం వీరి కాపురం సజావుగానే సాగింది. ఆ తరువాత దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. 2018లో షమీపై గృహహింస కేసు పెట్టింది హసీన్. తనను హింసంచడంతో పాటు వరకట్న కోసం వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించింది. దీంతో షమీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆ సమయంలో తనకు ఎలాంటి ఆర్థిక సాయం అందడం లేదని చెప్పింది.
భరణం కింద నెలకు రూ.10లక్షలు చెల్లించాలని డిమాండ్ చేసింది. ఇందులో రూ.7లక్షలు తనకు కాగా.. మిగిలిన మూడు లక్షలు తన కూతురి కోసం అని చెప్పింది. భరణం పై కోర్టు సోమవారం తుది తీర్పును ఇచ్చింది. అయితే.. తాజాగా తీర్పుపై హసీన్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.