జారుతున్న సెంట‌ర్ కోర్టు.. ఏడుస్తూ సెరెనా నిష్క్ర‌మ‌ణ‌

Serena Williams out of Wimbledon.వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో టాప్‌ సీడ్‌ ఆష్లే బార్టీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Jun 2021 5:56 AM GMT
జారుతున్న సెంట‌ర్ కోర్టు.. ఏడుస్తూ సెరెనా నిష్క్ర‌మ‌ణ‌

వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో టాప్‌ సీడ్‌ ఆష్లే బార్టీ శుభారంభం చేయగా.. మాజీ చాంపియన్‌ రోజర్‌ ఫెడరర్‌, నాలుగో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌, ఆండ్రే రుబలేవ్‌, కరోలినా ప్లిస్కోవా, కెర్బర్‌ రెండో రౌండ్‌కు చేరుకున్నారు. అమెరికా టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్‌ గాయంతో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. తీవ్ర భావోద్వేగానికి గురైన సెరైనా అభిమానుల స‌మ‌క్షంలోనే క‌న్నీరు పెట్టుకుంది. త‌న చిర‌కాల స్వ‌ప్నం మ‌రింత ఆల‌స్యం కావ‌డ‌మే అందుకు కార‌ణం.

మంగ‌ళ‌వారం సెరెనా సెంట‌ర్ కోర్టులో అలియ‌క్‌సాండ్ర స‌స‌నోవిచ్‌తో త‌ల‌ప‌డింది. ఐదో గేమ్‌లో స‌ర్వీస్ చేస్తుండ‌గా బేస్‌లైన్ వ‌ద్ద ఆమె కాలు బెణికింది. పాయింట్ల మ‌ధ్య నొప్పితో విల‌విల్లాడింది. ఆ గేమ్ ముగియ‌గానే మెడిక‌ల్ టైమ్ ఔట్ తీసుకుని ఆట‌ను కొన‌సాగించింది. అయితే.. నొప్పికి త‌ప్పుకోలేక పెద‌వుల‌ను బిగ‌ప‌ట్టీ క‌న్నీరు పెట్టుకుంది. అభిమానులు ఆమెకు ఎంతో అండ‌గా నిలిచారు. అరుపుల‌తో ప్రోత్స‌హించారు. చివ‌రికి నొప్పిని భ‌రించ‌లేక మైదానంలో కూర్చుండిపోయింది. చైర్ అంపైర్ ఆమె ద‌గ్గ‌రికి వ‌చ్చి ప‌రిస్థితిని ప‌రిశీలించారు. ఆ త‌రువాత నెట్ వ‌ద్ద‌కు వెళ్లిన విలియ‌మ్స్ ప్ర‌త్య‌ర్థితో చేయి క‌లిపి అభిమానుల‌కు వంద‌నం చేస్తూ ఏడుస్తూ మ్యాచ్ నుంచి త‌ప్పుకుంది.

ఆధునిక టెన్నిస్‌లో అత్య‌ధిక గ్రాండ్‌స్లామ్‌లు కైవ‌సం చేసుకున్న క్రీడాకారిణి సెరెనా విలియ‌మ్సే. ఇప్ప‌టి వ‌ర‌కు 23 గెలుచుకుంది. అయితే..ఆల్‌టైం అత్య‌ధిక గ్రాండ్‌స్లామ్‌ల రికార్డు మాత్రంమార్గ‌రెట్ కోర్ట్ పేరిట ఉంది. ఆమె 24 గెలిచింది. ఈ సారి గెలిచి ఆమె రికార్డును స‌మం చేయాల‌ని రెండేళ్లుగా పైగా సెరెనా శ్ర‌మించింది. అయితే.. ప‌రిస్థితులు క‌లిసిరాక గాయాల బెడ‌ద‌తో తొలిరౌండ్ లోనే ఆమె త‌ప్పుకుంది.

వింబుల్డ‌న్ సెంట‌ర్ కోర్టుపై విమ‌ర్శ‌లు..

వింబుల్డ‌న్ సెంట‌ర్ కోర్టుపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. గ్రాస్‌కోర్టు చాలా స్లిప్ప‌రీగా మారింద‌ని ప్లేయ‌ర్లు త‌ప్పుప‌డుతున్నారు. గ‌డ్డి ఎక్కువ‌గా ఉండే వింబుల్డ‌న్ మైదానాల్లో ఆట‌గాళ్లు ఎక్కువగా జారిప‌డే అవ‌కాశాలు ఉంటాయి. అయితే మంగ‌ళ‌వారం ఇద్ద‌రు ప్లేయ‌ర్లు జార‌డంతో వారు ఆట నుంచి త‌ప్పుకున్నారు. సెరీనా క‌న్నా ముందు ఫెద‌ర‌ర్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆడ్రియ‌న్ మ‌న్న‌రినో కూడా బేస్‌లైన్ వ‌ద్ద స్లిప్ అయ్యాడు. దీంతో అత‌నికి కూడా మ‌డిమ ప‌ట్టేసింది. ఆ ప్లేయ‌ర్ కూడా మ‌ధ్య‌లోనే రిటైర్ కావాల్సి వ‌చ్చింది. ఇద్ద‌రు ప్లేయ‌ర్లు వ‌రుస మ్యాచ్‌ల్లో గాయ‌ప‌డ‌డంతో.. సెంట‌ర్ కోర్టుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. నాలుగేళ్ల త‌ర్వాత వింబుల్డ‌న్ ఆడుతున్న ఆండీ ముర్రే ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. సెంట‌ర్ కోర్టు ప్ర‌మాద‌క‌రంగా మారిన‌ట్లు అత‌ను ట్వీట్ చేశాడు. సెరీనా త‌ప్పుకున్న తీరు ప‌ట్ల ఫెద‌ర‌ర్ కూడా ఆందోళ‌న వ్య‌క్తం చేశాడు.

Next Story