ఆస్ట్రేలియా ఓపెన్‌లో టాప్ సీడ్ ఆటగాళ్లు ముందంజ వేశారు. అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ కొత్త కాస్ట్యూమ్‌తో బరిలోకి దిగింది. 'వన్ లెగ్ క్యాట్ సూట్'ను ధరించి బరిలో దిగింది. అయితే అందుకు ఓ కారణం ఉంది. తన అభిమాన క్రీడాకారిణి, అమెరికా ఒలింపిక్ స్ప్రింట్ క్వీన్ ఫ్లోరిన్ గ్రిఫిత్ జాయ్ నర్ కు నివాళిగా ఈ డ్రెస్ ధరించినట్టు ఆమె తెలిపింది. 'ఫ్లో జో'గా పేరున్న ఫ్లోరెన్స్ 1988లో మహిళల 100, 200 మీటర్ల విభాగాల్లో ప్రపంచ రికార్డులు నెలకొల్పింది.
తన కెరీర్‌లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురిపెట్టిన సెరెనా.. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో పదో ర్యాంకర్ సెరెనా 6–1, 6–1తో లౌరా సిగెమండ్ (జర్మనీ)పై గెలిచి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. 56 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సెరెనా నాలుగు ఏస్‌లు సంధించడంతో పాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. సెరెనాతోపాటు ఆమె అక్క వీనస్ విలియమ్స్, రెండో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా), మూడో సీడ్ నయోమి ఒసాకా (జపాన్), తొమ్మిదో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) కూడా రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు.
పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా) రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. తొలి రౌండ్‌లో జొకోవిచ్ 6-3, 6-1, 6-2తో జెరెమి చార్డీ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. 5 నెలలుగా టెన్నిస్ సర్క్యూట్‌కు దూరంగా ఉన్న జొకో... ఎలాంటి తడబాటు లేకుండా ఆడాడు. గంటా 31 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బ్యాక్ హ్యాండ్, ఫోర్ హ్యాండ్ షాట్లతో పాటు పదునైన సర్వీస్‌లతో ఆకట్టుకున్నాడు.