ఇక ట్యాలెంట్ ఎందుకు అంటూ.. బీసీసీఐని దుమ్మెత్తి పోసిన సెహ్వాగ్
Sehwag slams BCCI.తాజాగా టీమిండియా డాషింగ్ బ్యాట్స్మెన్ వీరేందర్ సెహ్వాగ్ యోయో టెస్ట్ విషయంలో బీసీసీఐని దుమ్మెత్తిపోశారు.
By తోట వంశీ కుమార్ Published on 1 April 2021 7:09 AM GMTక్రికెట్ లో ట్యాలెంట్ ఎంతో ముఖ్యం.. ఆ ట్యాలెంట్ ను చూసే అవకాశాలు ఇవ్వాలి. అయితే భారతజట్టులో చోటు దక్కించుకునే సమయంలో మాత్రం యోయో టెస్ట్ ను ప్రామాణికం చేస్తూ వస్తున్నారు. ఇదే చాలా మంది క్రికెటర్ల పాలిట శాపంగా మారుతోంది. ఈ విషయంపై చర్చ చాలా ఏళ్లుగా సాగుతోంది. తాజాగా టీమిండియా డాషింగ్ బ్యాట్స్మెన్ వీరేందర్ సెహ్వాగ్ యోయో టెస్ట్ విషయంలో బీసీసీఐని దుమ్మెత్తిపోశారు.
ఆటగాళ్లు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలంటే యోయో టెస్ట్ తప్పనిసరిగా క్లియర్ చేయాలన్న నియమాన్ని బీసీసీఐ 2018 నుంచి అమలులోకి తెచ్చింది. చాలామంది భారత క్రికటర్లు యోయో టెస్ట్‌లో విఫలమైన కారణంగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని కోల్పోయారని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పారు. క్రికటర్ల ఎంపిక అనేది నైపుణ్యం ఆధారంగా జరగాలని, ఫిట్‌నెస్ టెస్ట్ కొలమానంగా కాదని అన్నారు. బీసీసీఐ గత నెలలో యోయో టెస్ట్ నియమాలను మరింత కఠినతరం చేయడంపై సెహ్వాగ్ విమర్శలు గుప్పించారు. కనీస అర్హతను 16:1 నుండి 17:1 చేయడం, నిర్ణీత సమయంలో రెండు కిలోమీటర్ల పరుగును పూర్తి చేయడం వంటి సరికొత్త నిబంధనలు కరెక్ట్ కాదన్నారు.
నైపుణ్యంతో ఏమాత్రం సంబంధంలేని ఈ ఫిట్‌నెస్ టెస్ట్ వల్ల అంబటి రాయుడు, సంజు సాంసన్, మహ్మద్ షమీ, తాజాగా రాహుల్ తెవాతియా, వరుణ్ చక్రవర్తి లాంటి ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఎంపికయ్యే అవకాశాలను కోల్పోయారన్నారు. ఆటగాళ్లకు మొదటగా అవకాశాలు కల్పించి ఆతరువాత వారి ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాలని బీసీసీఐకి సూచించారు. ఇలాంటి టెస్ట్‌లు తమ జమానాలో జరిగి ఉంటే సచిన్, గంగూలీ, లక్ష్మణ్ లాంటి దిగ్గజ ఆటగాళ్లకు అసలు అవకాశాలే వచ్చేవి కావని తేల్చి చెప్పారు. ఆటగాళ్లు ఫిట్‌గా ఉండి నైపుణ్యం లేకపోతే, అది జట్టుకు ఏమాత్రం ఉపయోగకరం కాదని.. ఈ విషయాన్ని బీసీసీఐ పరిగణలోకి తీసుకుంటుందని ఆశించారు.