నేడే రెండో క్వాలిఫయర్.. ఫైనల్ చేరేది ఎవరో..?
Second Qualifier match between Rajasthan Royals vs Royal Challengers Bangalore.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)2022
By తోట వంశీ కుమార్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. తొలి క్వాలిఫయర్‌లో పోరాడి ఓడిన రాజస్థాన్, ఎలిమినేటర్‌లో కష్టం మీద గెలిచిన బెంగళూరు ఫైనల్ బెర్తు కోసం అహ్మదాబాద్ వేదికగా నేడు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఢీ కొననుంది.
ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో విజేతగా నిలిచిన రాజస్థాన్ ఆ తరువాత ఇప్పటి వరకు మరోసారి టైటిల్‌ను నెగ్గలేదు. అయితే.. ఈ సీజన్‌లో అంచనాలకు మించి రాణిస్తోంది. ముఖ్యంగా జోస్ బట్లర్, సంజు శాంసన్‌ల విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో జట్టును ముందుండి నడిపిస్తున్నారు. లీగ్ దశలో ప్రథమార్థంలో హెట్‌మయర్ మెరుపులు మెరిపించినా.. ఆ తరువాత ఆ స్థాయిలో రాణించకపోవడం ఆ జట్టును కలవరపెడుతోంది. రెండో క్వాలిఫయర్‌లో ఈ ముగ్గురు సత్తా చాటితేనే జట్టుకు విజయం పై ఆశలు ఉంటాయి. చాహల్, బౌల్డ్, ప్రసిద్ధ్, అశ్విన్‌లతో కూడిన బౌలింగ్ దశం తొలి క్వాలిఫయర్‌లో విఫలం అయ్యారు. మరీ బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న బెంగళూరును వీరు ఏ మేరకు కట్టడి చేస్తారో చూడాలి.
ప్రస్తుతం అందరి కళ్లు బెంగళూరు మీదే ఉన్నాయి. తమ చిరకాల కల నెరవేర్చుకునేందుకు ఆర్‌సీబీ రెండడుగుల దూరంలో నిలిచింది. కెప్టెన్ డుప్లెసిస్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ విఫలమైన వేళ.. యువ ఆటగాడు రజత్ పటిదార్ విధ్వంసం కారణంగానే ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు విజయం సాధించింది. ఇక రాజస్థాన్‌తో నేటి కీలక మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, డుప్లెసిస్,మాక్స్‌వెల్ రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. వీరితో పాటు పటీదార్, దినేష్ కార్తీక్ మరోసారి రాణిస్తే బెంగళూరు ఫైనల్‌కు చేరడం పెద్ద కష్టమేమీ కాదు. హర్షల్ పటేల్‌తో పాటు హజిల్‌వుడ్, హసరంగ రాణిస్తుండటంతో బౌలింగ్‌లో బెంగళూరుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది.
ఇక ఈ సీజన్‌లో ఇరు జట్లు రెండు సార్లు తలపడగా.. చెరో మ్యాచులో విజయం సాధించాయి. మొత్తంగా ఈ టోర్నీలో ఇరు జట్లు 24 సార్లు తలపడగా.. బెంగళూరు 13, రాజస్థాన్ 11 మ్యాచుల్లో గెలుపొందాయి.