బంగ్లాదేశ్‌కు ఐసీసీ డెడ్‌లైన్‌.. ఆ త‌ర్వాత టీ20 ప్రపంచకప్‌ ఆడ‌బోయేది ఈ జట్టే..!

త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు క్రికెట్‌లో కలకలం రేగుతోంది. భారత్, బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ వివాదం నిరంతరం పెరుగుతోంది.

By -  Medi Samrat
Published on : 19 Jan 2026 5:02 PM IST

బంగ్లాదేశ్‌కు ఐసీసీ డెడ్‌లైన్‌.. ఆ త‌ర్వాత టీ20 ప్రపంచకప్‌ ఆడ‌బోయేది ఈ జట్టే..!

త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు క్రికెట్‌లో కలకలం రేగుతోంది. భారత్, బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ వివాదం నిరంతరం పెరుగుతోంది. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు భారత్‌ వెలుపల తన మ్యాచ్‌లను నిర్వ‌హించాల‌ని.. శ్రీలంక లేదా పాకిస్తాన్‌కు మార్చాల‌ని మొండిగా ఉంది. అయితే దీనిపై ICC బంగ్లాదేశ్‌కు కఠినమైన అల్టిమేటం పంపింది. బంగ్లాదేశ్ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు భారత్‌లోనే ఆడాల్సి ఉంటుందని ఐసీసీ పేర్కొంది. అంతేకాదు.. బంగ్లాదేశ్ టోర్నమెంట్‌లో పాల్గొంటుందా లేదా అనేది స్పష్టం చేయడానికి 21 జనవరి 2026 వరకు ICC గడువు ఇచ్చింది.

భద్రతా కారణాల దృష్ట్యా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఇప్పటికీ తమ జట్టును భారత్‌కు పంపడానికి నిరాకరిస్తే.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) టోర్నమెంట్‌లో వారి స్థానంలో మ‌రో జట్టును చేర్చనుంద‌ని నివేదిక‌లు చెబుతున్నాయి. అయితే.. తుది నిర్ణయం తీసుకునేందుకు ఐసీసీ బీసీబీకి జనవరి 21 వరకు సమయం ఇచ్చింది. టోర్నమెంట్ ప్రారంభానికి మూడు వారాలు మాత్రమే మిగిలి ఉంది. దీంతో ICC ఈ విష‌యాన్ని త్వ‌ర‌గా ముగించాల‌ని భావిస్తుంది. ఢాకాలో జరిగిన సమావేశాల్లో టోర్నీ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు ఉండదని ఐసీసీ స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ తన ప్రారంభ మ్యాచ్‌లను కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో, ఆపై ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆడాల్సి ఉంది.

జనవరి 21 వరకు కూడా బంగ్లాదేశ్ తన పట్టుదలపై మొండిగా ఉంటే.. టోర్నమెంట్‌లో వారి స్థానంలో స్కాట్లాండ్‌కు ప్రపంచ కప్ ఆడే అవకాశాన్ని ICC ఇవ్వవచ్చు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్ 9వ స్థానంలో ఉంది. దీని తర్వాత ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్, జింబాబ్వే, నెదర్లాండ్స్ ఉన్నాయి. అయితే ఈ జట్లన్నీ ప్రపంచ కప్‌లో ఆడుతున్నాయి. వాటి త‌ర్వాత స్కాట్లాండ్ 14వ స్థానంలో ఉంది. అంటే బంగ్లాదేశ్ ఔట్ అయితే ఐసీసీ స్కాట్లాండ్‌కు అవకాశం ఇస్తుంది.

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) సూచనల మేరకు కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) జట్టు నుండి ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను విడుదల చేయ‌డంతో ఈ వివాదం మరింత పెరిగింది. ఈ సంఘటన తర్వాత BCB తన భద్రతా సంబంధిత డిమాండ్లను మరింత తీవ్రతరం చేసింది.

బంగ్లాదేశ్ ఇచ్చిన మ్యాచ్ షిఫ్ట్ ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించింది. బంగ్లాదేశ్, ఐర్లాండ్ గ్రూప్‌ల‌ను పరస్పరం మార్చుకోవాలని BCB సూచించింది, తద్వారా బంగ్లాదేశ్ తన అన్ని మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడవచ్చు. అయితే, తమ మ్యాచ్‌లకు సంబంధించి గట్టి హామీలు లభించాయని, షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు ఉండదని ఐర్లాండ్ స్పష్టం చేసింది. గ్రూప్‌ను మార్చడం వల్ల బ్రాడ్‌కాస్టర్‌లు, టిక్కెట్ భాగస్వాములు, ఇతర జట్లతో పెద్ద వివాదం ఏర్పడుతుందని ఐసిసి తెలిపింది.

Next Story