T20 World Cup: కోహ్లీ లేకపోతేనేం.. శామ్సన్ ఉన్నాడుగా.. ఛేజింగ్‌తో సెమీస్‌లోకి భారత్
ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన పోరు కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ మాత్రమే కాదు, అది భారత జట్టు ఆత్మవిశ్వాసానికి పరీక్ష.
By - అంజి |
T20 World Cup: కోహ్లీ లేకపోతేనేం.. శామ్సన్ ఉన్నాడుగా.. ఛేజింగ్‌తో సెమీస్‌లోకి భారత్
ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన పోరు కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ మాత్రమే కాదు, అది భారత జట్టు ఆత్మవిశ్వాసానికి పరీక్ష. వెస్టిండీస్ విసిరిన 195 పరుగుల భారీ లక్ష్యం చూస్తుంటే.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సూర్యకుమార్ నిర్ణయం తప్పనిపించింది. చరిత్ర కూడా భారత్‌కు వ్యతిరేకంగానే ఉంది. విరాట్ కోహ్లీ లేకుండా టీ 20 ప్రపంచకప్‌లో 160 కంటే ఎక్కువ స్కోరును భారత్ ఎప్పుడూ ఛేదించలేదు. కానీ, ఆ రాత్రి ఒక కొత్త హీరో ఉదయించాడు. అతడే సంజూ శామ్సన్.
ఆరంభంలోనే షాక్.. నిశ్శబ్దమైన స్టేడియం
లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆరంభం అస్సలు కలిసిరాలేదు. పవర్‌ప్లేలోనే స్టార్ ఓపెనర్లు అభిషేక్ శర్మ (10), ఇషాన్ కిషన్ (10) పెవిలియన్ చేరారు. 5 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 41/2. మైదానంలోని 60 వేల మంది ప్రేక్షకులు నిశ్శబ్దంలో మునిగిపోయారు. కోహ్లీ లేడు, ఓపెనర్లు అవుట్ అయ్యారు.. భారత్ ఓటమి ఖాయమని అందరూ భావించిన తరుణంలో సంజూ శామ్సన్ తన ఫామ్‌ని చూపించాడు. సంజూ శామ్సన్ ఆడిన ఇన్నింగ్స్ విరాట్ కోహ్లీ గొప్ప ఛేజింగ్‌లను గుర్తుకు తెచ్చింది. అనవసరపు ఒత్తిడికి లోనుకాకుండా, బంతిని బట్టి షాట్లు ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు.
సంజూ 50 బంతుల్లో 97 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో టి20 ప్రపంచకప్ ఛేజింగ్‌లో కోహ్లీ పేరిట ఉన్న అత్యధిక స్కోరు (82) రికార్డును శామ్సన్ అధిగమించాడు. సూర్యకుమార్ యాదవ్ (58 పరుగుల భాగస్వామ్యం) అండగా నిలవగా, తిలక్ వర్మ (15 బంతుల్లో 27) మెరుపులు మెరిపించాడు. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే తమ వంతు సహకారం అందించారు. శామ్సన్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత బ్యాట్ ఎత్తి పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు. కేవలం మళ్ళీ గార్డ్ తీసుకుని తర్వాతి బంతికి సిద్ధమయ్యాడు. ఆ ఏకాగ్రత, ఆ పట్టుదలే భారత్‌ను 19.2 ఓవర్లలోనే విజేతగా నిలబెట్టాయి.
తొలి ఇన్నింగ్స్: విండీస్ విధ్వంసం.. బుమ్రా బ్రేకులు
అంతకుముందు బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. షాయ్ హోప్, రోస్టన్ చేజ్ ఇన్నింగ్స్ ప్రారంభించి మంచి పునాది వేశారు. షిమ్రాన్ హెట్మెయర్ క్రీజులోకి రాగానే సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 10 బంతుల్లోనే 25 పరుగులు చేసి భారత్‌ను వణికించాడు. ఈ టోర్నీలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. విండీస్ 220 వైపు వెళ్తున్న తరుణంలో సూర్యకుమార్ బుమ్రాను రంగంలోకి దించాడు. బుమ్రా ఒకే ఓవర్లో ప్రమాదకరమైన హెట్మెయర్‌ను, సెట్ అయిన రోస్టన్ చేజ్‌ను అవుట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
సెమీఫైనల్ బెర్త్ ఖరారు
ఈ అద్భుత విజయంతో భారత్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మార్చి 5న ముంబైలో జరిగే రెండో సెమీఫైనల్‌లో భారత్, ఇంగ్లాండ్‌తో తలపడనుంది. అంతకంటే ముందు మార్చి 4న కోల్‌కతాలో సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది.