సంజూ శాంసన్ భారీ సెంచరీ కొట్టినా గెలిపించుకోకపోవడంతో ఏమన్నాడంటే..!

Sanju Samson About Loosing Match Against Punjab Kings. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్

By Medi Samrat  Published on  13 April 2021 6:50 AM GMT
Sanju samson

రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్ అసలైన టీ20 మజాను అందించింది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంమ్సన్ 63 బంతుల్లోనే 119 పరుగులు (12 ఫోర్లు, 7 సిక్స్ లు) రాణించినా ఆఖరి బంతికి అవుట్ కావడంతో, పంజాబ్ కింగ్స్ జట్టు నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 50 బంతుల్లో 91 పరుగులు చేయగా, దీపక్ హుడా 28 బంతుల్లో 64 పరుగులు చేశారు.

222 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కు మొదటి ఓవర్ లోనే మొహమ్మద్ షమీ షాక్ ఇచ్చాడు. బెన్ స్టోక్స్ ను అవుట్ చేశాడు. వరుసగా వికెట్లను కోల్పోతున్నా సంజూ శాంసన్ అద్భుతంగా ఆడాడు. పది ఓవర్లు ముగిసేవరకు రెండు వికెట్లు కోల్పోయి, 89 పరుగులు చేసింది రాజస్థాన్. ఆ తర్వాత మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగారు రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్. సంజూకు బట్లర్ (25 పరుగులు), శివమ్ దూబే (23 పరుగులు), రియాన్ పరాగ్(25) అండగా నిలువగా, మ్యాచ్ ఆఖరు బంతి వరకూ సాగింది. చివరి ఓవర్ ను అర్హదీప్ వేయగా ఆఖరి రెండు బంతులకు ఐదు పరుగులు అవసరం అయ్యాయి. తొలి బంతికి సింగిల్ తీసే అవకాశం లభించినా, సంజూ, దాన్ని వద్దనుకున్నాడు. ఆఖరి బంతిని సిక్స్ గా మలచాలని అతను చేసిన ప్రయత్నాన్ని లాంగ్ ఆన్ లో ఉన్న దీపక్ హుడా క్యాచ్ పట్టడంతో రాజస్థాన్ రాయల్స్ పరాజయం పాలైంది.

Advertisement

ఈ మ్యాచ్ ఓటమి అనంతరం సంజూ శాంసన్ మాట్లాడుతూ.. తనకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదన్నాడు. తాము టార్గెట్ కు చాలా దగ్గరగా వెళ్లామని.. కానీ దురదృష్టం కొద్దీ ఓడిపోయామని అన్నాడు. ఇంతకన్నా తాను ఇంకేం చేయగలనని.. గేమ్ లో గెలుపు, ఓటములు సహజమని భావోద్వేగానికి గురయ్యాడు. పిచ్ సమయం గడిచే కొద్దీ బ్యాటింగ్ కు అనుకూలంగా మారుతుందని, తాము సులువుగానే టార్గెట్ ను చేరుకోగలమని అనుకున్నామని, అంత పని చేశామని చెప్పాడు. చివరకు ఓడిపోవడం బాధను కలిగించినా, తాము బాగా ఆడామన్న తృప్తి మిగిలిందని అన్నాడు.


Next Story
Share it