Video : పంత్‌తో సంజీవ్ గోయెంకా ముచ్చ‌ట.. పాత కథను గుర్తు చేసుకుంటున్న అభిమానులు

IPL 2025 నాల్గవ మ్యాచ్ లక్నో సూపర్‌జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ‌ధ్య జ‌రిగింది.

By Medi Samrat
Published on : 25 March 2025 2:44 PM IST

Video : పంత్‌తో సంజీవ్ గోయెంకా ముచ్చ‌ట.. పాత కథను గుర్తు చేసుకుంటున్న అభిమానులు

IPL 2025 నాల్గవ మ్యాచ్ లక్నో సూపర్‌జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ‌ధ్య జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక వికెట్ తేడాతో గెలిచింది. అయితే మ్యాచ్‌లో ఓట‌మి త‌ర్వాత లక్నో జ‌ట్టు యజమాని సంజీవ్ గోయెంకా కెప్టెన్ రిషబ్ పంత్‌తో చాలాసేపు మాట్లాడారు. లక్నో ఓటమి తర్వాత జట్టు డగౌట్‌లో రిషబ్ పంత్, ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్‌తో సంజీవ్ గోయెంకా సుదీర్ఘంగా మాట్లాడటం కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

ఎందుకంటే గత సంవత్సరం సంజీవ్ గోయెంకా KL రాహుల్‌తో కూడా ఇలానే చాలా వాడివేడిగా మాట్లాడాడు. తాజాగా పంత్‌తో ఉన్న వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్ట‌డంతో.. అభిమానులు పాత కథను గుర్తు చేసుకున్నారు. అయితే.. ఈసారి కెప్టెన్ పంత్, కోచ్ లాంగర్‌తో గోయెంకా బాగా మాట్లాడటం కనిపిస్తుంది.

IPL 2025 మెగా వేలంలో లక్నో సూపర్‌జెయింట్ రిషబ్ పంత్‌ను రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. లక్నో జెర్సీలో పంత్ అరంగేట్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. పంత్‌ ఇన్నింగ్స్ కేవలం 6 బంతులకే పరిమితమైంది. ఖాతా కూడా తెరవలేకపోయాడు. కుల్దీప్ యాదవ్ వేసిన బంతిని డు ప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చాడు పంత్.

అలాగే.. మోహిత్ శర్మను స్టంపింగ్ చేసే అవకాశాన్ని కూడా పంత్ మిస్ చేశాడు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. కెప్టెన్‌గా పంత్ అరంగేట్రం నిరాశపరిచింది. తొలి మ్యాచ్‌లోనే ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

ఢిల్లీ క్యాపిటల్స్ విజయంలో అశుతోష్ శర్మ కీలక పాత్ర పోషించాడు. 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ 7 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత 65 పరుగులకే సగం జట్టు డగౌట్‌కు చేరుకుంది. ఆ తర్వాత అశుతోష్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేశాడు. విప్రజ్ నిగమ్ (31)తో కలిసి శర్మ ఊహించని విధంగా చేసి ఢిల్లీకి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అశుతోష్ శర్మ కేవలం 31 బంతుల్లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో అజేయంగా 66 పరుగులు చేశాడు. ఈ విజయంతో ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో ఢిల్లీ నాలుగో స్థానంలో నిలిచింది. అదే సమయంలో లక్నో జట్టు ఓటమి పాలైనప్పటికీ ఐదో స్థానంలో ఉంది.

Next Story