అతడిని చూసి భయపడ్డాం.. 250 చేసుంటే బాగుండేదని అనిపించింది
Samson says We're afraid of a batsman like Ruturaj Gaikwad.ఐపీఎల్ 14వ సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్, రాజస్థాన్
By తోట వంశీ కుమార్ Published on 3 Oct 2021 1:24 PM ISTఐపీఎల్ 14వ సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన పోరులో పరుగుల వరద పారింది. చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 101 నాటౌట్; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ శతకంతో అదగొడితే.. రాజస్థాన్ తరఫున యశస్వి జైస్వాల్ (21 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), శివం దూబే (42 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచికొట్టారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేయగా.. 190 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 17.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి చేదించింది.
ఇక మ్యాచ్ అనంతరం రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ మాట్లాడుతూ.. మా బ్యాటింగ్ లైనప్ సామర్థ్యం ఎంటో మాకు తెలుసని.. అందుకే ఓడినప్పుడల్లా బాధకలుగుతుందన్నాడు. అలాంటి సమయంలో మాకు మేమే ధైర్యం తెచ్చుకోవాలని చెప్పుకొచ్చాడు. ఓపెనర్లు చాలా మంచి శుభారంభం అందించారని.. ఇక ఈ సీజన్‌లో జైశ్వాల్ అద్భుతంగా ఆడుతున్నాడని కితాబిచ్చాడు. శివమ్ దూబే బ్యాటింగ్ గురించి గత కొన్ని రోజులుగా చర్చించుకున్నాం. ఈ మ్యాచ్‌లో చెలరేగడంతో ఈరోజు అతడిదే అనుకున్నామన్నాడు. చైన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గురించి మాట్లాడుతూ..అద్భుతంగా ఆడాడని అన్నాడు. గైక్వాడ్ ఆటతీరు చూసి భయపడినట్లు తెలిపాడు. అలాంటి ఆటగాడిని గౌరవించాలని, అతడు సెంచరీ సాధించినందుకు సంతోషంగా ఉందన్నాడు. ప్లే ఆప్స్ గురించి పెద్దగా ఆలోచించడం లేదని.. ఒక్కొక్క మ్యాచ్‌పై మాత్రమే దృష్టి సారించి ముందుకు వెలుతున్నట్లు చెప్పాడు.
చెన్నై కెప్టెన్ ధోని మాట్లాడుతూ.. తొలి 6 ఓవర్లలోనే రాజస్థాన్ ఓపెనర్లు మ్యాచ్‌ను లాగేసుకున్నారన్నారు. 190 పరుగులు అనేది మంచి స్కోరే అయినప్పటికి తేమ ప్రభావం చూపించడంతో బంతి బ్యాట్‌పైకి వచ్చిందన్నాడు. రాజస్థాన్ ఆడిన తీరు చూస్తే.. మేం 250 పరుగులు చేసుంటే బాగుండేదని అనిపించిందని ధోని చెప్పాడు. ఈ ఓటమి నుంచి నేర్చుకోవాలని.. ప్లే ఆఫ్స్‌లో ఇలాగే జరిగితే అప్పుడు ఉపయోగపడుతుందని కెప్టెన్ కూల్ చెప్పాడు.