Viral Video : ఆ షాట్‌ అచ్చం 'యువ‌రాజ్ సింగ్‌'లానే ఆడాడు..!

పాకిస్థాన్ ఓపెనర్ సామ్ అయ్యూబ్ శుక్రవారం ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఫ్లిక్ షాట్ ద్వారా సిక్సర్ కొట్టి భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్‌ను గుర్తుకుతెచ్చాడు.

By Kalasani Durgapraveen  Published on  9 Nov 2024 7:15 AM IST
Viral Video : ఆ షాట్‌ అచ్చం యువ‌రాజ్ సింగ్‌లానే ఆడాడు..!

పాకిస్థాన్ ఓపెనర్ సామ్ అయ్యూబ్ శుక్రవారం ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఫ్లిక్ షాట్ ద్వారా సిక్సర్ కొట్టి భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్‌ను గుర్తుకుతెచ్చాడు. అడిలైడ్‌లో జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్ 163 పరుగులకు ఆస్ట్రేలియాను ఆలౌట్ చేసింది. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రౌఫ్ బౌలింగ్ విధ్వంసంతో కంగారూ బ్యాట్స్‌మెన్ పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. అనంతరం శామ్ అయ్యూబ్ (82), అబ్దుల్లా షఫీక్ (64*) అద్భుత ఇన్నింగ్స్‌తో పాక్ 26.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ విజయంతో పాకిస్థాన్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య సిరీస్‌లో మూడో, చివరి మ్యాచ్ ఆదివారం పెర్త్‌లో జరగనుంది. అయితే, సామ్ అయ్యూబ్ ఫ్లిక్ షాట్‌కు చాలా ప్రశంసలు లభిస్తున్నాయి. సామ్ అయ్యూబ్ తన ఇన్నింగ్స్‌లో అర డజను సిక్సర్లు కొట్టాడు. అయితే ఫ్లిక్ షాట్‌పై మాత్రం తీవ్ర‌మైన చ‌ర్చ న‌డుస్తోంది. పాక్‌ ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మిచెల్ స్టార్క్ బౌలింగ్ చేసిన లెంగ్త్ బాల్‌ను శామ్ అయ్యూబ్ ఫైన్ లెగ్ వైపు సిక్సర్‌గా మ‌లిచాడు. ఈ షాట్ చూసి క్రికెట్ అభిమానులు యువరాజ్ సింగ్‌ని గుర్తు చేసుకున్నారు. 2007 టీ20 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ బ్రెట్ లీ వేసిన బంతిని అలాంటి షాట్ ఆడడం ఇప్పటికీ అభిమానుల మదిలో మెదులుతోంది.

రెండో వన్డేలో పాక్‌ ప్రత్యేక విజయం సాధించింది. ఏడేళ్ల తర్వాత అంటే 2017 తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాపై పాకిస్థాన్ తొలి వన్డే విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు కెప్టెన్‌గా ఉన్న మహ్మద్ రిజ్వాన్ ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఇన్నింగ్స్‌లో రిజ్వాన్ మొత్తం ఆరు క్యాచ్‌లు అందుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిచినా.. ఫీల్డింగ్‌లో తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

Next Story