క్రికెట్ భారత్‌లో ఓ మతమైతే.. ఆ మతానికి సచిన్ దేవుడు. అంతలా సచిన్ భక్తులున్నారు భారత్లో. చిన్నవయసులో ఆరంగేట్రం చేసి వివాదరహితుడిగా రెండు దశాబ్దాల కెరీర్‌ను అప్రతిహతంగా కొనసాగించిన ఆటగాడు మాస్టర్ బ్లాస్టర్. ఇలా సచిన్ గురించి చెప్పడానికి చాలానే ఉంది. అయితే.. రిటైర్మెంట్ అనంతరం సచిన్ ఐఎస్ఎల్, పీబీఎల్ లలో పెట్టుబడులు పెట్టి వ్యాపారంలోకి అడుగుపెట్టాడు.
కొద్ది కాలంగా వాటికే పరిమితమయిన సచిన్ తాజాగా.. ఎడ్యుకేషన్ టెక్ స్టార్టప్ అయిన అన్అకాడమీలో పెట్టుబడి పెట్టాడు. అల్రెడీ అన్అకాడమీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సచిన్.. ఇక నుంచి ఫ్రీగా పాఠాలు కూడా చెప్పనున్నాడు. అన్అకాడమీలోకి వెళ్లి సచిన్ చెప్పే క్రికెట్ పాఠాలను ఎవరైనా ఉచితంగా చూడవచ్చు. సచిన్ తన జీవిత పాఠాలను పంచుకుంటాడని, లెర్నర్స్‌కు కోచింగ్ ఇస్తాడని అన్అకాడమీ కోఫౌండర్ గౌరవ్ ముంజాల్ తెలిపారు. స్పోర్ట్స్ లెర్నింగ్ కేటగిరీలో సచిన్ పాఠాలు వీక్షించవచ్చని పేర్కొన్నారు.
ఈ విషయమై సచిన్ మాట్లాడుతూ.. నా జీవిత పాఠాలను విద్యార్థులతో పంచుకోవాలని తాను ఎప్పటి నుంచో భావిస్తున్నట్లు తెలిపాడు. తన విజన్.. అన్అకాడమీ మిషన్.. ఒకేలా ఉండటంతో ఇద్దరం కలిసి పనిచేస్తున్నామని తెలిపాడు. భారత్‌లోని మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్లు కూడా నేర్చుకునేందుకు అన్అకాడమీ ఓ వారధిలా ఉంటుందని సచిన్ అన్నారు.