సచిన్ కోటి రూపాయల విరాళం

Sachin tendulkar donates RS 1 crore. స‌చిన్ టెండూల్క‌ర్ ఆక్సిజ‌న్ కొర‌త‌తో బాధ‌ప‌డుతున్న వారికి సాయం చేసేందుకు మిష‌న్ ఆక్సిజ‌న్ అనే సంస్థ‌కు త‌న వంతుగా కోటి రూపాయ‌ల ఆర్థిక సాయాన్ని అంద‌జేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 April 2021 2:28 AM GMT
Sachin donated Rs.1 crore

క్రికెట్ దేవుడు, దిగ్గ‌జ ఆట‌గాడు స‌చిన్ టెండూల్క‌ర్ మ‌రోసారి త‌న గొప్ప మ‌న‌సును చాటుకున్నారు. సెకండ్ వేవ్‌తో భార‌త‌దేశం త‌ల్ల‌డిల్లుతున్న నేప‌థ్యంలో క‌రోనా బాధితుల‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఆక్సిజ‌న్ కొర‌త‌తో బాధ‌ప‌డుతున్న వారికి సాయం చేసేందుకు మిష‌న్ ఆక్సిజ‌న్ అనే సంస్థ‌కు త‌న వంతుగా కోటి రూపాయ‌ల ఆర్థిక సాయాన్ని అంద‌జేశారు. 250 మందికి పైగా యువకులతో మిషన్ ఆక్సిజన్ సంస్థ వైరస్ బాధితులకు ఆక్సిజన్ అందించేందుకు పనిచేస్తోంది. "కరోనా సెకండ్‌ వేవ్‌తో ఆరోగ్య వ్వవస్థపై చాలా భారం పడింది. చాలా మంది కొవిడ్‌ బాధితులకు ఆక్సిజన్‌ అందించడం అత్యవసరం" అని సచిన్‌ ట్వీట్‌ చేశాడు.

దేశంలో మొదటి సారి కరోనా విపత్తు సంభవించినప్పుడు ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు విరాళాన్ని అందజేసిన మాస్టర్.. స్వచ్చంద సంస్థలతో కలిసి పేద ప్రజలకు నిత్యవసర వస్తువులు కూడా అందజేశాడు. ఇక రోడ్ సేఫ్టీ వరల్డ్ సూపర్ సిరీస్ సందర్భంగా కరోనా బారిన పడిన మాస్టర్ కోలుకున్న సంగ‌తి తెలిసిందే.

క‌రోనా బాధితుల‌ను ఆదుకునేందుకు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కూడా ముందుకు వ‌చ్చింది. కొవిడ్‌-19 స‌హాయ చ‌ర్య‌ల కోసం రూ.7.5 కోట్లు విరాళాన్ని ప్ర‌క‌టించింది. 'క‌రోనా బాధితుల స‌హాయం కోసం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌రుపున రూ.7.5కోట్లు ప్ర‌క‌టిస్తున్నాం. ఆట‌గాళ్లు, జ‌ట్టు య‌జ‌మానులు, జ‌ట్టు మేనేజ్‌మెంట్ ఈ మొత్తాన్ని సేక‌రించ‌డంలో భాగ‌మ‌య్యారు. బ్రిటిష్ ఏషియ‌న్ ట్ర‌స్ట్ కూడా ఇందులో ఉంది'. అని రాజ‌స్థాన్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.



Next Story