అటు లారా.. ఇటు సచిన్.. కోహ్లీ ఏం చేస్తాడో..!!
Sachin , Lara records on radar as Virat Kohli's inches close to more milestones. భారత క్రికెట్ దిగ్గజం మాస్టర్
By Medi Samrat Published on 16 Dec 2020 5:02 PM ISTభారత క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తర్వాత ఆ స్థానంలో రికార్డులు నెలకొల్పిన ఆటగాడు విరాట్ కోహ్లీనే. సచిన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టగలిగిన సత్తా ఉన్న ఏకైక బ్యాట్స్‌మెన్ కోహ్లి అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఇటు వన్డే.. అటు టెస్టుల్లో ఒక్కో రికార్డును ఛేదించుకుంటూ వస్తున్న కోహ్లీని మరో అడుగు దూరంలో మరో రెండు రికార్డులు ఊరిస్తున్నాయి.
లారా రికార్డును బ్రేక్ చేస్తాడా.?
వెస్టిండీస్ సూపర్ బ్యాట్స్‌మెన్ బ్రియన్ లారా టెస్టుల్లో ఎన్నో అరుదైన రికార్డులు నెలకొల్పాడు. ఇప్పటికీ టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 400 పరుగులు లారా పేరు మీదనే ఉంది. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడిన బ్రియన్ లారా 76.25 సగటుతో రెండు సెంచరీలు.. ఒక హాఫ్ సెంచరీతో 610 పరుగులు సాధించాడు. ఇప్పటి వరకూ ఆ రికార్డును ఏ ప్రపంచ ఆటగాడూ ఛేదించలేకపోయాడు. ఇప్పుడు ఆ సువర్ణావకాశం టీం ఇండియా సారథి విరాట్ కోహ్లీని ముందుకొచ్చింది. అడిలైడ్ స్టేడియంలో కోహ్లీ 71.83 సగటుతో మూడు సెంచరీలు చేసి 431 పరుగులు సాధించాడు. లారా రికార్డును బ్రేక్ చేయడానికి కోహ్లీకి కేవలం 179 పరుగులు మాత్రమే కావాల్సి ఉంది. డిసెంబర్ 15 నుంచి ప్రారంభంకానున్న మొదటి డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 179 పరుగులు చేస్తే లారా రికార్డును ఊదేయొచ్చు.
సచిన్‌ని దాటేస్తాడా!
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న ఫస్ట్ టెస్ట్‌లో కోహ్లీ 179 పరుగులు చేస్తే లారాతో పాటు సచిన్ రికార్డునూ బ్రేక్ చేస్తాడు. టీం ఇండియా తరఫున ఆస్ట్రేలియా గడ్డపై 20 మ్యాచ్‌లు ఆడిన మాస్టర్ బ్లాస్టర్ 20 మ్యాచ్‌ల్లొ ఆరు సెంచరీలు సాధించి 1809 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ కూడా సచిన్‌తో సమానంగా ఆరు సెంచరీలు చేశాడు. అడిలైడ్‌లో కోహ్లీ ఒక్క సెంచరీ చేస్తే సచిన్ రికార్డు బద్దలు కొట్టిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా చరిత్రలోకి ఎక్కుతాడు. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై 12 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ ఆరు సెంచరీలతో 1274 పరుగులు చేశాడు.