రింకూ కోసమే ఇండియా మ్యాచ్‌లు చూస్తున్నా: రసేల్
టీమిండియా నయా స్టార్ రింకూ సింగ్ అంటే తనకు ఎంత ఇష్టమో వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రసెల్ మరోసారి బయటపెట్టాడు.
By Srikanth Gundamalla Published on 1 Dec 2023 10:31 AM ISTరింకూ కోసమే ఇండియా మ్యాచ్‌లు చూస్తున్నా: రసేల్
ఆస్ట్రేలియాతో భారత జట్టు ప్రస్తుతం టీ20 మ్యాచ్‌లు ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు మ్యాచ్‌లు జరగ్గా 2-1తో భారత్ ఆధిక్యంలో కొనసాగుతోంది. భారత యంగ్ ప్లేయర్లు అద్బుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా ఫినిషర్‌గా వస్తోన్న రింకూ సింగ్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ధోనీ తర్వాత ఇన్నాళ్లు టీమిండియాలో బెస్ట్ ఫినిషర్ కనిపించలేదనీ.. కానీ రింకూని చూస్తే ఆ లోటు తీర్చేలా కనిపిస్తున్నాడంటూ మాజీలు సైతం కామెంట్స్ చేయడం చూశాం. తాజాగా విండీస్ ఆల్‌రౌండర్ కూడా రింకూ సింగ్ గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. అతని ఆట కోసమే ప్రస్తుతం టీమిండియా మ్యాచ్‌లు చూస్తున్నా అని కామెంట్స్ చేశాడు.
టీమిండియా నయా స్టార్ రింకూ సింగ్ అంటే తనకు ఎంత ఇష్టమో వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రసెల్ మరోసారి బయటపెట్టాడు. తాజాగా ఆస్ట్రేలియాతో భారత్ ఆడుతున్న మ్యాచ్‌లను తాను రింకూ కోసమే చూస్తున్నట్లు చెప్పాడు. అబుదాబిలో జరుగుతోన్న టీ10 లీగ్‌లో ఆడుతోన్న రసేల్ అక్కడి నుంచి హిందూస్తాన్ టైమ్స్‌తో మాట్లాడాడు. భారత్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్ మ్యాచుల్లో ఒకవేళ ఏదైనా మిస్ అయితే తప్పకుండా హైలెట్స్ అయినా చూస్తున్నా అని పేర్కొన్నాడు. రింకూ ఇప్పటి వరకు ఇండియా తరఫున నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడాడు. 59 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. కానీ అందులో 21 బంతులను బౌండరీలకు తరలించాడు. ధోనీ తర్వాత బెస్ట్ ఫినిషర్ అంటూ ప్రశంసలు అందుకుంటున్నారు.
ఈ క్రమంలోనే రింకూ సింగ్ గురించి మాట్లాడిన రసేల్.. అతని ఆటతీరు ఆశ్చర్యం కలిగించలేదని చెప్పాడు. కొన్నేళ్ల కింద కేకేఆర్‌తో చేరాడనీ.. ప్రతిసారి అతను నెట్స్‌లో ఆడుతున్నప్పుడు అతడి సామర్థ్యాన్ని గుర్తించామని తెలిపాడు. అసలు అవకాశాలు అందుకుని కీలక మ్యాచుల్లో ఒక్కో మ్యాచ్ గెలిపిస్తూ వెళ్లడం రింకూసింగ్ ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని తెలిపాడు. భారత జట్టుకి ఇంత చిన్న వయసులో ఈ స్థాయిలో ఆడటం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని రసేల్ తెలిపాడు. రానున్న రోజుల్లో రింకూసింగ్ మరింత మెరుగైన బ్యాటర్ అవుతాడని రసేల్ అన్నాడు.