బెంగళూరుకు తప్పని భంగపాటు.. జోస్ బట్లర్ శతకం.. ఫైనల్‌లో రాజస్థాన్
RR beat RCB by 7 wickets in Qualifier 2 to face GT in IPL final.రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మరోసారి నిరాశ తప్పలేదు
By తోట వంశీ కుమార్ Published on 28 May 2022 8:59 AM ISTరాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మరోసారి నిరాశ తప్పలేదు. అదృష్టం కలిసి వచ్చి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన ఆ జట్టు క్వాలిఫయర్-2లో రాజస్థాన్ చేతిలో ఓటమిపాలైంది. పుల్ ఫామ్‌లో ఉన్న జోస్ బట్లర్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో బెంగళూరు ఆశలపై నీళ్లు చల్లాడు. ఫలితంగా రాజస్థాన్ జట్టు పైనల్‌కు చేరుకుంది. ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో టైటిల్ గెలిచిన తరువాత మళ్లీ ఇన్నాళ్లకు రాజస్థాన్ ఫైనల్ చేరడం గమనార్హం. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో రాజస్థాన్ తలపడనుంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ(7) పేలవ ఫామ్‌ను కొనసాగించగా, డుప్లెసిస్(25), మాక్స్‌వెల్(24), దినేశ్ కార్తీక్(6) ఆశించిన రీతిలో రాణించలేకపోయారు. అయితే.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సూపర్ శతకంతో సత్తా చాటిన రజత్ పటీదారు(58; 42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థశతకంతో మరోసారి ఆకట్టుకున్నాడు. రాజస్థాన్ బౌలర్లలో మెక్‌కాయ్, ప్రసిద్ధ్ కృష చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యాన్ని రాజస్థాన్ 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేదించింది. ఈ సీజన్‌లో పుల్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ జోస్ బట్లర్ (106 నాటౌట్; 60 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు) మరోసారి శతకంతో చెలరేగిపోయాడు. దీంతో మ్యాచ్ ఏకపక్షంగా మారింది. బట్లర్‌కు తోడు యశస్వి జైస్వాల్ (21; 13 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు), సంజూ శాంసన్ (23; 21 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) చెరో చేయి వేయడంతో ఏ దశలోనూ బెంగళూరు విజయం సాధించేలా కనిపించలేదు.
బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడిన బట్లర్ 59 బంతుల్లో ఈ సీజన్‌లో నాలుగో శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తరువాత బంతిని సిక్సర్‌గా మలిచి రాజస్థాన్‌ను ఫైనల్‌కు చేర్చాడు. బెంగళూరు బౌలర్లలో హజిల్‌వుడ్ 2 వికెట్లు పడగొట్టాడు. ఒంటి చేత్తో విజయాన్ని అందించిన బట్లర్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'అవార్డు దక్కింది.