ఐపీఎల్-2021లో భాగంగా పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో కోహ్లీసేన 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్‌కి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. బెంగళూరు జట్టులో విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ (57) అర్ధ శతకంతో రాణించగా.. ఓపెనర్లు దేవ్‌దత్ పడిక్కల్ (40), విరాట్ కోహ్లి (25) శుభారంభం చేశారు. పంజాబ్ బౌలర్లలో హెన్రిక్స్ మూడు, మహమ్మద్ షమీ మూడు వికెట్లు తీశారు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు.. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (57) అర్ధ శతకంతో రాణించినా పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. కెప్టెన్ రాహుల్ (39), మార్‌క్రమ్ (20) ఫర్వాలేదనిపించారు. షారుక్ ఖాన్ (16) చివరి ఓవర్లో ఔటయ్యాడు. నికోలస్ పూరన్ (3), సర్ఫరాజ్ (0) విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో యుజువేంద్ర చాహల్ మూడు వికెట్లు, షాబాజ్ అహ్మద్, జార్జ్ గార్టన్ తలో వికెట్ తీశారు.