డూ ఆర్ డై మ్యాచ్‌లో గెలిచిన ఆర్సీబీ.. ప్లేఆఫ్ ఆశ‌లు స‌జీవం

ఐపీఎల్ 2024 62వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 47 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది

By Medi Samrat  Published on  13 May 2024 7:30 AM IST
డూ ఆర్ డై మ్యాచ్‌లో గెలిచిన ఆర్సీబీ.. ప్లేఆఫ్ ఆశ‌లు స‌జీవం

ఐపీఎల్ 2024 62వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 47 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ కు ఇది డూ-ఆర్ డై మ్యాచ్ కాగా.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జ‌ట్టు 187 పరుగులు చేసింది. అనంతరం చేధ‌న‌లో ఢిల్లీ జట్టు 140 పరుగులకే పరిమితమైంది.

ఆర్‌సీబీకి ఇది వరుసగా ఐదో విజయం. ఈ విజ‌యంతో ఆ జట్టు ఇంకా ప్లేఆఫ్ రేసులో ఉంది. 13 మ్యాచ్‌లు ఆడి ఆరు విజయాలు, ఏడు ఓటములతో 12 పాయింట్లను కలిగి ఉంది. ఢిల్లీపై విజయంతో ఆ జట్టు ఐదో స్థానానికి చేరుకుంది. బెంగళూరు తన చివరి మ్యాచ్‌ని మే 18న చెన్నై సూపర్ కింగ్స్‌తో చిన్నస్వామి వేదికగా ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌పై ఇరు జట్ల భవితవ్యం ఆధారపడి ఉంటుంది. చెన్నై గెలిస్తే ఆర్సీబీ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. అదే సమయంలో బెంగళూరు గెలిస్తే చెన్నై కంటే నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండి మంచి తేడాతో గెలవాలి. ఆ తర్వాత కూడా బెంగళూరు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

బెంగళూరు-ఢిల్లీ, లక్నో మూడు జ‌ట్లు త‌లా 12-12 పాయింట్లతో ఉన్నారు. లక్నో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు మాత్రమే ఆడింది. ఈ జట్టు 16 పాయింట్లకు చేరుకునే అవ‌కాశం ఉంది. ఢిల్లీ, బెంగళూరు 13-13 మ్యాచ్‌లు ఆడాయి. ఈ ఓటమితో ఢిల్లీ గరిష్ఠంగా 14 పాయింట్లకు మాత్రమే చేరుకోగల‌దు. ఇందుకోసం మే 14న తమ సొంత మైదానంలో లక్నో సూపర్ జెయింట్‌పై గెలవాలి. కోల్‌కతా జట్టు ఇప్పటికే 18 పాయింట్లతో ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. అదే సమయంలో రాజస్థాన్ 12 మ్యాచుల్లో 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. 13 మ్యాచ్‌ల తర్వాత చెన్నై 14 పాయింట్లతో ఉండగా.. సన్‌రైజర్స్ 12 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.

Next Story