వ‌రుస ఓట‌ముల‌కు బ్రేక్‌.. రాజ‌స్థాన్‌పై స‌న్‌రైజ‌ర్స్ విజ‌యం

Roy fifties take Hyderabad to a convincing win over Rajasthan.ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్)2021లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Sept 2021 8:57 AM IST
వ‌రుస ఓట‌ముల‌కు బ్రేక్‌.. రాజ‌స్థాన్‌పై స‌న్‌రైజ‌ర్స్ విజ‌యం

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్)2021లో ప‌రాజ‌యాల ప‌రంప‌ర‌కు ఎట్ట‌కేల‌కు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ అడ్డుకట్ట వేసింది. వ‌రుస‌గా అయిదు ఓట‌ముల త‌రువాత ఓ విజ‌యాన్ని అందుకుంది. రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో హైద‌రాబాద్ ఓపెన‌ర్ జేస‌న్ రాయ్‌(42 బంతుల్లో 60; 8 ఫోర్లు, ఒక సిక్సర్‌) చెల‌రేగి ఆడ‌డంతో రాజస్థాన్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.

అంత‌క‌ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. సంజూ శాంసన్‌ (57 బంతుల్లో 82; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆక‌ట్టుకోగా ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ (36) పరుగుల‌తో రాణించారు. వీరిద్ద‌రు మిన‌హా మిగ‌తా బ్యాట్స్‌మెన్లు దారుణంగా విఫ‌లం కాగా.. మహిపాల్‌ లోమ్రర్‌ (29 నాటౌట్‌) ఫ‌ర్వాలేద‌నిపించాడు. స‌న్‌రైజ‌ర్స్ బౌలర్లలో సిద్ధార్థ్‌ కౌల్‌ రెండు వికెట్లు తీయ‌గా సందీప్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌, రషీద్‌ ఖాన్‌ తలా ఓ వికెట్‌ పడగొట్టారు.

165 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు వార్న‌ర్ స్థానంలో తుది జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్న ఇంగ్లాండ్ ఓపెన‌ర్ జేస‌న్ రాయ్ అదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. మ‌రో ఓపెన‌ర్‌ సాహా(18)తో క‌లిసి స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. ఎడా పెడా బౌండ‌రీలు బాద‌డంతో అయిదు ఓవ‌ర్ల‌లోనే స‌న్‌రైజ‌ర్స్ స్కొరు 57/0 కి చేరింది. త‌రువాత‌ సాహా ఔటైనా.. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (41 బంతుల్లో 51 నాటౌట్‌; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌) తోడుగా రాయ్ చెల‌రేగి ఆడాడు. దీంతో 10 ఓవ‌ర్ల‌కు స్కోరు 90/1 తో ల‌క్ష్యం దిశ‌గా సాగింది. తెవాటియా ఓవర్‌లో 6,4,4,4 కొట్టిన రాయ్‌.. 36 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో రాయ్‌, ప్రియ‌మ్ గార్గ్‌(0) ఔటైనా.. అభిషేక్‌ శర్మ (21 నాటౌట్‌) వ‌ర్మ‌తో క‌లిసి విలియమ్సన్ జ‌ట్టుకు విజ‌యాన్ని అందించాడు.

Next Story