788 రోజుల క్రితం జట్టు నుండి త‌ప్పించారు.. ఇప్పుడు పిలిచి ఏకంగా కెప్టెన్సీ ఇచ్చారు..!

వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు కొత్త టెస్టు జట్టు కెప్టెన్ ఎంపికయ్యాడు. అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్‌ రోస్టన్‌ చేజ్‌కు టెస్టు జట్టు కెప్టెన్సీ అప్పగించారు

By Medi Samrat
Published on : 17 May 2025 10:16 AM IST

788 రోజుల క్రితం జట్టు నుండి త‌ప్పించారు.. ఇప్పుడు పిలిచి ఏకంగా కెప్టెన్సీ ఇచ్చారు..!

వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు కొత్త టెస్టు జట్టు కెప్టెన్ ఎంపికయ్యాడు. అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్‌ రోస్టన్‌ చేజ్‌కు టెస్టు జట్టు కెప్టెన్సీ అప్పగించారు. క్రెయిగ్ బ్రాత్‌వైట్ రాజీనామా చేసిన 2 నెలల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరగనున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో వెస్టిండీస్ జట్టుకు రోస్టన్ చేజ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రోస్టన్ చివరిసారిగా మార్చి 2023లో వెస్టిండీస్ తరఫున టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత.. అతను టెస్ట్ మ్యాచ్ ఆడటమే కాకుండా జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.

బ్రాత్‌వైట్ సారథ్యంలో వెస్టిండీస్ జట్టు పాకిస్థాన్ పర్యటనలో టెస్టు సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఆ తర్వాత అకస్మాత్తుగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. 2 నెలల సెర్చ్ తర్వాత రోస్టన్ చేజ్‌ను కెప్టెన్‌గా చేయాలని విండీస్ బోర్డు నిర్ణయించింది.

జూన్ 25 నుండి వెస్టిండీస్ ఆస్ట్రేలియాతో తలపడే మ్యాచ్‌తో కెప్టెన్‌గా రోస్టన్ చేజ్ పదవీకాలం ప్రారంభమవుతుంది. 33 ఏళ్ల రోస్టన్ చేజ్ కెప్టెన్సీలో వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాతో స్వదేశంలో 3 టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది.. ఇది కొత్త ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చక్రంలో విండీస్‌ మొదటి సిరీస్.

రోస్టన్ చేజ్ 2016 సంవత్సరంలో వెస్టిండీస్ తరపున టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేసాడు. అతను తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను 11 మార్చి 2023న దక్షిణాఫ్రికాతో ఆడాడు. సిరీస్‌లోని రెండవ టెస్ట్ మ్యాచ్‌లో రోస్టన్ మొదటి ఇన్నింగ్స్‌లో 28 పరుగులు, రెండవ ఇన్నింగ్స్‌లో 0 పరుగులు చేసి అవుటయ్యాడు. వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా 2-0తో సిరీస్‌ని కైవసం చేసుకుంది.

చేజ్ ఇప్పటివరకు వెస్టిండీస్ తరపున 49 టెస్టులు ఆడాడు.. అందులో 2,265 పరుగులు చేయడంతో పాటు.. 85 వికెట్లు తీసుకున్నాడు. బ్యాటింగ్‌లో 5 సెంచరీలు, 11 అర్ధ సెంచరీలు చేశాడు. అలాగే ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన ఫీట్‌ను 4 సార్లు సాధించాడు.

Next Story