రంజీ రీఎంట్రీలోనూ విఫలం.. రోహిత్‌పై విరుచుకుపడుతున్న ఫ్యాన్స్
10 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో పునరాగమనం చేసిన రోహిత్ శర్మ విఫలమయ్యాడు.
By Medi Samrat Published on 23 Jan 2025 5:28 PM IST10 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో పునరాగమనం చేసిన రోహిత్ శర్మ విఫలమయ్యాడు. జనవరి 23 నుంచి జమ్మూకశ్మీర్‌తో ముంబై తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నారు. 8 బంతులు ఎదుర్కొన్న యశస్వి 4 పరుగులు చేయగా, 19 బంతులు ఎదుర్కొన్న సమయంలో రోహిత్ 3 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో పదేళ్ల తర్వాత రంజీ ట్రోఫీకి తిరిగి వచ్చిన రోహిత్ విఫలమయ్యాడు. అంతకుముందు 2015లో యూపీతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో రోహిత్ సెంచరీ బాదాడు. ఇప్పుడు రోహిత్ పేలవమైన ప్రదర్శన చేయడంతో.. అభిమానులు అతడిని ట్రోల్ చేస్తున్నారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో మూడు మ్యాచ్‌ల్లో 31 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ శర్మ విమర్శలకు గురయ్యాడు. పేలవ ప్రదర్శన కారణంగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకోవాలని అభిమానులు సలహా ఇస్తున్నారు. రోహిత్ ఫామ్‌లోకి రావాలంటే.. రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడాలని సూచించిన అభిమానులే.. అక్కడ విఫలమవడంతో రిటైర్ అవమని సలహా ఇస్తున్నారు.
జమ్ముకశ్మీర్‌తో జరిగిన ఎలైట్ గ్రూప్-ఎ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. యశస్వి జైస్వాల్‌తో కలిసి ముంబై ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు రోహిత్ క్రీజులోకి వచ్చాడు. 19 బంతులు ఎదుర్కొన్న రోహిత్.. మైదానంలో పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. జమ్మూ కాశ్మీర్ బౌలర్ ఉమర్ నజీర్ బంతికి పికె డోగ్రాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీని తర్వాత కెప్టెన్ అజింక్యా రహానే కూడా ఉమర్ నజీర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రహానే 17 బంతుల్లో రెండు ఫోర్లతో 12 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్(11) కూడా తక్కవ పరుగులకే ఔటయ్యాడు. శార్ధుల్ ఠాకూర్(51) మాత్రమే పర్వాలేదనిపించగా.. ముంబై 120 పరుగులకే కుప్పకూలింది. జమ్ముకశ్మీర్ బౌలర్లలో ఉమర్ నజీర్, యుధ్వీర్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు.