వరల్డ్‌ కప్‌లో తిలక్‌ ఆడతాడా? కెప్టెన్ రోహిత్‌ శర్మ ఏమన్నాడంటే..

టీ20 సిరీస్‌లో అరంగేట్రం చేసిన టీమిండియా బ్యాటర్ తిలక్‌ వర్మ పేరు మార్మోగుతోంది.

By Srikanth Gundamalla  Published on  11 Aug 2023 2:30 PM IST
Rohit,  Tilak varma,  World Cup, Team India,

వరల్డ్‌ కప్‌లో తిలక్‌ ఆడతాడా? కెప్టెన్ రోహిత్‌ శర్మ ఏమన్నాడంటే..

టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్‌తో టీ20 మ్యాచ్‌లు ఆడుతోంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌లు అయిపోయాయి. వీటిల్లో రెండు ఓటమి పాలవ్వగా మూడో టీ20లో విజయం సాధించింది. ఇక మరో రెండు టీ20 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. అయితే.. ఈ టీ20 సిరీస్‌లో అరంగేట్రం చేసిన టీమిండియా బ్యాటర్ తిలక్‌ వర్మ పేరు మార్మోగుతోంది. హైదరాబాద్‌ కుర్రాడి ఆటను ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. క్రికెట్‌ అభిమానులు అయితే తిలక్‌ ఆట తీరుకు ఫిదా అయిపోతున్నారు. వరుగా జరిగిన మూడు మ్యాచుల్లోనూ తిలక్‌ వర్మ రాణించాడు.

తొలి మ్యాచ్ లో 39 పరుగులు చేస్తే.. రెండో మ్యాచ్ లో 51 పరుగులు చేశాడు తిలక్‌ వర్మ. ఇక మూడో టి20లో 49 పరుగులతో అజేయంగా నిలిచి టీమ్‌ను గెలిపించాడు. ప్రస్తుతం విండీస్‌తో జరుగుతున్న టి20 సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా తిలక్ వర్మ నిలిచాడు. ఎంతో బాగా బ్యాటింగ్ చేస్తోన్న తిలక్‌ వర్మ గురించే ఇప్పడు సీనియర్లు, మాజీ క్రికెటర్లు చర్చించుకుంటున్నారు. ఈసారి తిలక్‌ వర్మను కూడా వరల్డ్‌ కప్‌లో ఆడిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తిలక్‌ను వరల్డ్‌ కప్‌లో ఆడే భారత జట్టులోకి తీసుకోవాలని స్టార్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, మాజీ చీఫ్ సెలక్టర్లు ఎమ్మెస్కే ప్రసాద్‌ సూచించారు. అంతేకాదు.. క్రికెట్‌ అభిమానులు కూడా అతడు నిలకడగా ఆడుతున్నాడని.. నాలుగో స్థానంలో తిలక్‌నే ఆడిస్తే బాగుటుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ వరల్డ్‌ కప్‌లో తిలక్‌ ఆడే విషయంపై స్పందించాడు.

తిలక్ వర్మను ప్రపంచ కప్ లో ఆడించే విషయంలో స్పష్టమైన సమాధానం ఇవ్వకపోయినా అతని ఆటను ప్రశంసించాడు రోహిత్‌ శర్మ. మూడు మ్యాచ్‌లే ఆడినా తిలక్‌ వర్మ జట్టులో నమ్మదగ్గ ఆటగాడిగా మారాడని చెప్పాడు. క్రికెట్‌ పట్ల అతనికి నిబద్ధత, కసి ఉందని తెలిపాడు. ఈ వయసులోనే అంత పరిణతితో ఆడటం అరుదైన విషయం అని పొగిడాడు రోహిత్‌ శర్మ. తిలక్‌ వర్మ ప్రతిభావంతుడని ఇప్పటికే నిరూపితం అయ్యిందని చెప్పాడు. అయితే.. వరల్డ్‌ కప్‌లో తిలక్‌ ఆడే విషయం తన చేతిలో లేదని.. అలాంటివి సెలెక్టర్లు చూసుకుంటారని తెలిపారు కెప్టెన్ రోహిత్‌ శర్మ. కాగా.. పలువురు సీనియర్లు గాయాలతో టీమ్‌కు దూరంగా ఉన్న క్రమంలో ఫామ్‌లో ఉన్న తిలక్‌ వర్మను వరల్డ్‌ కప్‌లో ఆడిస్తే టీమ్‌కు బలం చేకూరుతుందని పలువురు క్రీడా నిపుణులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన రెండు టి20ల్లోనూ తిలక్ వర్మ రాణించి.. ఆ తర్వాత ఐర్లాండ్ పర్యటనలోనూ సత్తా చాటితే.. తిలక్ వర్మను ఆసియాకప్ తో పాటు వన్డే ప్రపంచకప్ కు ఎంపిక చేసే అవకాశం ఉందని అంటున్నారు.

Next Story