టైటిల్ నెగ్గిన ఇండియా లెజెండ్స్..!
Road Safety World Series 2021 Final. ఇండియా లెజెండ్స్ జట్టు రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ 20సిరీస్ టైటిల్ ను సొంతం చేసుకుంది.
By Medi Samrat Published on 22 March 2021 3:41 AM GMTటాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇండియా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(10), ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మన్ ఎస్ బద్రీనాథ్ విఫలమయ్యారు. కెప్టెన్ సచిన్ టెండూల్కర్(23 బంతుల్లో 5 ఫోర్లతో 30) మరోసారి రాణించాడు యువీ, యూసఫ్ చెలరేగారు. సచిన్-యువీ మూడో వికెట్‌కు 43 పరుగులు జోడించగా.. యువీ-యూసఫ్ నాలుగో వికెట్ 85 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. యువ రాజ్ సింగ్(41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 60), యూసఫ్ పఠాన్(36 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 62 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో శ్రీలంక లెజెండ్స్ ముందు ఇండియా లెజెండ్స్ 182 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. శ్రీలంక లెజెండ్స్ బౌలర్లలో రంగన హెరాత్, సనత్ జయసూర్య, ఫర్వీజ్ మెహరూఫ్, వీర రత్నే తలో వికెట్ తీశారు.
లక్ష్య ఛేదనలో శ్రీలంక ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. సనత్ జయసూర్య, తిలకరత్నే దిల్షాన్ పవర్ ప్లే లో రాణించారు. దిల్షాన్ (18 బంతుల్లో 21), జయసూర్య (43), తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అయితే వీరిద్దరు అవుటయ్యాక లంక జోరు తగ్గింది. చివర్లో జయసింఘే (30 బంతుల్లో 40; ఫోర్, 2 సిక్స్‌లు), వీరరత్నే (15 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా ఫలితం లేకపోయింది. ఇండియా బౌలర్లలో యూసఫ్ పఠాన్(2/26), ఇర్ఫాన్ పఠాన్(2/26) తలా రెండు వికెట్లు తీయగా, మన్ ప్రీత్ గోనీ, మునాఫ్ పటేల్ లు తలా ఒక వికెట్ తీశారు. చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బాఘేల్ చేతుల మీదుగా ఇండియా లెజెండ్స్ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ కప్‌ను అందుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శన చేసిన యూసుఫ్ పఠాన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించగా.. శ్రీలంక లెజెండ్స్ జట్టు కెప్టెన్ దిల్షాన్ కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.