గ్రౌండ్ లో సందడి చేయడానికి సిద్ధమైన సచిన్, సెహ్వాగ్.. ఎంటర్టైన్‌మెంట్ పక్కా..
Road Safety World Series 2021. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ గ్రౌండ్ లో సందడి, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి "రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్" కు శ్రీకారం చుట్టారు.
By Medi Samrat Published on 11 Feb 2021 9:00 AM ISTసచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రియాన్ లారా, బ్రెట్ లీ, తిలకరత్నె దిల్షాన్, ముత్తయ్య మురళీధరన్ లాంటి లెజెండ్స్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికి చాలా కాలమే అయింది. కానీ ఆ లెజెండ్స్ మ్యాచ్ లు ఆడితే చూడాలని చాలా మందికి ఉంటుంది. మరీ క్రికెట్ విషయంలో టచ్ అయితే కోల్పోయి ఉండరు కాబట్టి.. అప్పుడప్పుడు ఛారిటీ మ్యాచ్ లు ఈ లెజెండ్స్ ఆడుతూ ఉంటారు. ఇక రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి "రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్" కు శ్రీకారం చుట్టారు.
కరోనా వైరస్ కారణంగా గతేడాది జరగాల్సిన రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్ వాయిదా పడింది. నాలుగు మ్యాచ్‌లు జరిగిన తర్వాత సిరీస్‌ను నిలిపివేశారు. ఇప్పుడు తిరిగి ఈ సిరీస్ ను మొదలుపెట్టబోతున్నారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, భారత్‌కు చెందిన పలువురు స్టార్ క్రికెటర్లు సిరీస్‌లో పాల్గొనబోతున్నారు. రాయ్‌పూర్‌లోని షాహీద్ వీర్ నారాయణ్‌సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మార్చి 2 నుంచి 21 వరకు ఈ సిరీస్ జరగనుంది. నిలిపివేసిన సిరీస్‌ను కొనసాగించాలని నిర్వాహకులు భావిస్తూ ఉన్నారు.
మిగిలిన మ్యాచ్‌లన్నీ రాయ్‌పూర్‌లో కొత్తగా నిర్మించిన 65 వేల సామర్థ్యం కలిగిన స్టేడియంలో జరగనున్నాయి. ప్రజల్లో అవగాహన కల్పించాలని గత సంవత్సరం చాలా ఆశతో సిరీస్ ఆరంభించామని.. కరోనా వల్ల వాయిదా వేయాల్సి వచ్చిందని సిరీస్ వ్యవస్థాపకులు రవి గైక్వాడ్ చెప్పుకొచ్చారు. మళ్లీ ఆరంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని రవి గైక్వాడ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకొని రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్ ద్వారా రోడ్ సేఫ్టీపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సిరీస్ ఏర్పాటు చేశారు.
సునీల్ గావస్కర్ సిరీస్‌కు కమిషనర్‌గా వ్యవహరిస్తుండగా.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు.బయో బబుల్ వాతావరణంలో టోర్నీని నిర్వహించనున్నారు. రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్‌కు రాయ్‌పూర్ ఆతిథ్యం ఇవ్వడం గర్వంగా, గౌరవంగా ఉందని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేలా అన్నారు. భారతీయ రహదారులపై ప్రతి నాలుగు నిమిషాలకు ఒక వ్యక్తి మరణిస్తున్నాడు. ఈ సిరీస్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడం ఒక అద్భుతమైన ఆలోచన అని భూపేష్ బాఘేలా చెప్పుకొచ్చారు.