యాక్సిడెంట్ త‌రువాత పంత్ తొలిసారి ట్వీట్‌.. 'ఆ ఇద్ద‌రు హీరోల‌ను మ‌రిచిపోలేను'

Rishabh Pant's First Reaction After Horrific Car Accident.రిష‌బ్ పంత్ ఇటీవ‌ల రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Jan 2023 5:33 AM GMT
యాక్సిడెంట్ త‌రువాత పంత్ తొలిసారి ట్వీట్‌.. ఆ ఇద్ద‌రు హీరోల‌ను మ‌రిచిపోలేను

టీమ్ఇండియా యువ వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ ఇటీవ‌ల రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డి ముంబైలోని ధీరూబాయ్ అంబానీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే. యాక్సిడెంట్ త‌రువాత మొద‌టి సారి పంత్ సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించాడు. ఈ క్లిష్ట స‌మ‌యంలో త‌నకు అండ‌గా నిలిచిన వారికి, తాను త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థించిన వారికి ట్విట‌ర్ వేదిక‌గా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశాడు.

శ‌స్త్ర చికిత్స విజ‌య‌వంతమైంది. ఈ విష‌యాన్ని మీకు తెలియజేసేందుకు నేను సంతోషిస్తున్నాను. కోలుకునే ప్ర‌క్రియ మొద‌లైంది. రాబోయే సవాళ్లకు నేను సిద్ధంగా ఉన్నాను.ఈ స‌మ‌యంలో నాకు అన్ని విధాలుగా అండ‌గా నిలిచిన బీసీసీఐ, జై షా, ప్ర‌భుత్వ‌యంత్రాగానికి, నేను కోలుకోవాల‌ని ప్రార్థించిన అభిమానుల‌కు, నా కోసం శ్ర‌మిస్తున్న వైద్యుల‌కు హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నా. త్వ‌ర‌లోనే మీ అంద‌రి మైదానంలో క‌ల‌వాల‌ని కోరుకుంటున్నా అని పంత్ ట్వీట్ చేశాడు.

ప్ర‌మాద స‌మ‌యంలో నాకు సాయం చేసిన ప్ర‌తి ఒక్క‌రికి పేరు పేరున ధ‌న్య‌వాదాలు తెలప‌లేక‌పోతున్నా. కానీ రంజత్‌ కుమార్‌, నిషు కుమార్.. ఈ ఇద్ద‌రు హీరోల‌కు త‌ప్ప‌కుండా నేను కృత‌జ్ఞ‌త‌లు చెప్పాలి. ప్ర‌మాదం త‌రువాత వారిద్ద‌రూ ఎంతో సాయం చేశారు. సకాలంలో సురక్షితంగా ఆసుపత్రికి చేర్చ‌డంలో వాళ్ల సహకారం మరువలేనిది. మీ ఇద్దరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా, మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా అని పంత్ అన్నాడు.

డిసెంబ‌ర్ 30న ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు వెలుతుండగా పంత్ కారు అదుపు త‌ప్పి డివైడ‌ర్‌ను ఢీ కొట్టింది. అనంత‌రం కారులో మంట‌లు చెల‌రేగాయి. అప్ర‌మ‌త్త‌మైన పంత్ కారు అద్దాలు ప‌గుల‌కొట్టి వెంట‌నే బ‌య‌ట‌కు దూక‌డంతో ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డ్డాడు.

Next Story
Share it