చెన్నైలో బంగ్లాదేశ్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజున టీమ్ ఇండియా స్టార్ రిషబ్ పంత్, బంగ్లాదేశ్ వికెట్ కీపర్-బ్యాటర్ లిట్టన్ దాస్ తో వాగ్వివాదానికి దిగాడు. భారత తొలి ఇన్నింగ్స్‌లో 15వ ఓవర్‌లో తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో యశస్వీ జైస్వాల్ గుడ్ లెంగ్త్ బౌల్డ్ చేశాడు. ఆ బంతి గల్లీ వైపు వెళ్ళింది. ఆ సమయంలో పంత్ ఒక పరుగు త్వరగా తీసేద్దామని అనుకున్నాడు. కానీ జైస్వాల్ రన్ వద్దని చెప్పడంతో నాన్ స్ట్రైక్ లోకి వెళ్లడానికి పంత్ పరిగెత్తాడు. ఫీల్డర్ నాన్-స్ట్రైకర్ ఎండ్ వైపు బంతిని విసరడంతో అది కాస్తా పంత్ ప్యాడ్‌లకు తగిలి మిడ్-ఆన్ వైపు వెళ్లింది. దీంతో పంత్, జైస్వాల్ రన్ తీశారు. అయితే పంత్ ప్యాడ్ కు తగిలి బంతి వెళ్లిందని, బ్యాటర్లు ఎలా రన్ తీస్తారని బంగ్లాదేశ్ ఆటగాడు లిట్టన్ దాస్ పంత్ తో వాగ్వాదానికి దిగాడు.
లిట్టన్ దాస్ పంత్‌కు ఏదో చెప్పబోతూ ఉండగా పంత్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. బాల్ వికెట్లకు తగిలేలా విసరాలని మీ వాళ్లకు చెప్పు.. బంతితో నా మీదకు ఎందుకు విసురుతున్నారు అంటూ పంత్ బదులు ఇచ్చాడు. వారి మాటలు స్టంప్‌లోని మైక్‌లలో రికార్డు అయ్యాయి. ఈ మ్యాచ్ లో పంత్ 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.