కెప్టెన్‌గా రీఎంట్రీ ఇవ్వనున్న రిషబ్ పంత్..!
By - Medi Samrat |
భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావడానికి మార్గం సుగమమైంది. దక్షిణాఫ్రికా Aతో జరిగే రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌కు అతడు ఇండియా A జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ మ్యాచ్‌లు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో అక్టోబర్ 30, నవంబర్ 6-9 మధ్య జరుగుతాయి.
జూలైలో మాంచెస్టర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ (భారత్ A కెప్టెన్) కాలికి గాయమైంది. ఆ తర్వాత అతను క్రికెట్ ఫీల్డ్‌కు దూరంగా ఉన్నాడు. ఈ కారణంగా, అతడు ఆసియా కప్, వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్, ఆస్ట్రేలియా పర్యటనలో భాగం కాలేకపోయాడు.
ఇదిలావుంటే.. ఢిల్లీ రంజీ ట్రోఫీ రెండవ రౌండ్ మ్యాచ్‌లో అక్టోబర్ 25 నుండి హిమాచల్ ప్రదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడేందుకు పంత్ సిద్ధమవగా.. సెలక్షన్ కమిటీ అతడికి ఇండియా A జట్టు పగ్గాలు అప్పగించింది. దీంతో పంత్ రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడటం కుదరదు. ఎందుకంటే.. ఆ సమయంలోనే ఇండియా A, దక్షిణాఫ్రికా A మధ్య మొదటి మ్యాచ్ ప్రారంభమవుతుంది.
పంత్‌తో పాటు సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్), ఆయుష్ మ్హత్రే, యశ్ ఠాకూర్, అన్షుల్ కాంబోజ్, తనుష్ కోటియన్, హర్ష్ దూబే, మానవ్ సుతార్, ఆయుష్ బదోని, సరాంశ్ జైన్‌లు తొలి ఫోర్-డే మ్యాచ్‌లో చోటు దక్కించుకున్నారు.
కెఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, అభిమన్యు ఈశ్వరన్, ఖలీల్ అహ్మద్, గుర్నూర్ బ్రార్, ఆకాష్ దీప్‌లతో కూడిన కొంతమంది సీనియర్ ఆటగాళ్లు రెండో మ్యాచ్‌కు జట్టులోకి వచ్చారు.
నవంబర్ 14న ప్రారంభమయ్యే భారత్-దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌కు సన్నాహాల్లో ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్ ముఖ్యమైన భాగం. అంతకుముందు వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు, ఆస్ట్రేలియా ఎతో భారత్ ఇలాంటి సిరీస్‌ను ఆడింది. టెస్టు క్రికెట్ మాత్రమే ఆడే ఆటగాళ్లు ఫామ్‌లో ఉండేందుకు దేశవాళీ క్రికెట్‌తో పాటు ఎ టీమ్ సిరీస్‌లలో పాల్గొనాలని ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఇటీవల చెప్పాడు. ఆటగాళ్లు కేవలం ఎన్‌సీఏలో ప్రాక్టీస్ చేయడం కంటే మ్యాచ్‌లు ఆడటం మంచిదని చెప్పాడు. దీంతో జట్టు కూడా లాభపడనుంది.
దక్షిణాఫ్రికా కూడా భారతదేశం A తో తన జట్టును ప్రకటించింది. గాయం నుండి కోలుకుంటున్న టెంబా బావుమా ఈ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. అతనితో పాటు జుబేర్ హంజా, ప్రేనెలోన్ సుబ్రేయన్, మిఖ్లాలీ మ్పోంగ్వానా, ఇతర యువ ఆటగాళ్లకు జట్టులో అవకాశం లభించింది.