చిన్నస్వామి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో టీమ్ఇండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో భారత్ తరుపున ఫాస్టెస్ట్ ఫిప్టి కొట్టిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. కేవలం 28 బంతుల్లో 7 పోర్లు, 2 సిక్సర్ల సాయంతో పంత్ ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో 40 ఏళ్ల కిందట కపిల్ దేవ్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. 1982లో కరాచీలో పాకిస్థాన్‌పై మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ 30 బంతుల్లో అర్థశతకాన్ని బాదగా.. పంత్ కేవలం 28 బంతుల్లోనే బాదాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టీమ్ఇండియా పట్టుబిగించింది. రెండో రోజు లంచ్ విరామ సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 143 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని ప్రస్తుతం 342 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. శ్రేయాస్ అయ్యర్(18), రవీంద్ర జడేజా(10) క్రీజులో ఉన్నారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఓటమి ఖాయం. టీమ్ఇండియా తొలిఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌట్ కాగా.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే కుప్పకూలింది.