గుజరాత్‌తో ఢిల్లీ పోరు.. రిషబ్ పంత్ వచ్చేస్తున్నాడు..!
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మద్దతు ఇచ్చేందుకు స్టేడియానికి వస్తున్నాడు రిషబ్ పంత్.
By తోట వంశీ కుమార్ Published on 4 April 2023 2:03 PM ISTరిషబ్ పంత్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో మరో ఆసక్తికర పోరుకు అంతా సిద్దమైంది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడనుంది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించి మంచి ఊపుమీదున్న గుజరాత్ టైటాన్స్ అదే జోష్‌ను కంటిన్యూ చేయాలని చూస్తుండగా, ఈ మ్యాచ్‌లో విజయం సాధించి బోణీ కొట్టాలని ఢిల్లీ పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ హోరాహోరీగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఐపీఎల్ 2023 సీజన్‌కు పూర్తిగా దూరం అయిన భారత వికెట్ కీపర్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రెగ్యులర్ కెప్టెన్ అయిన రిషబ్ పంత్.. తన జట్టుకు మద్దతు ఇచ్చేందుకు స్టేడియానికి వస్తున్నాడు. అతడిని తీసుకువచ్చేందుకు ఢిల్లీ ప్రాంచైజీ ప్రయత్నం చేస్తోంది.
ఢిల్లీ జట్టులో పంత్ ఎప్పుడూ అంతర్భాగమే. గుజరాత్ టైటాన్స్‌తో ఢిల్లీలో జరిగే మొదటి హోం మ్యాచ్‌ను చూసేందుకు పంత్ వచ్చే అవకాశం ఉంది. అతడు స్టేడియానికి వస్తే జట్టు యజమాని స్పెషల్ బాక్స్ నుంచి మ్యాచ్‌ను చూస్తాడు. బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం, భద్రతా విభాగం అనుమతి ఇస్తే.. అతడు ఢిల్లీ డగౌట్‌లో కూడా కూర్చోనే అవకాశం ఉంది అని ప్రాంచైజీ వర్గాలు తెలిపాయి.
సాధారణంగా బయటి వ్యక్తులను ఆటగాళ్ల డగౌట్‌లోనికి ఎంట్రీ ఉండదు. అయితే.. ఢిల్లీ మాత్రం బీసీసీఐని ఎలాగైనా ఒప్పించి పంత్‌ను డగౌట్‌లో కూర్చోనేలా చేయాలని ప్రయత్నిస్తోంది. ఇందుకు బీసీసీఐ ఒప్పుకుంటుందా..? లేదా అన్నది చూడాల్సి ఉంది.