అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ 5 పరుగులకే అవుటయ్యాడు. కీమార్ రోచ్ బౌలింగ్ లో హోప్ కి క్యాచ్ ఇచ్చాడు. దాంతో భారత్ 9 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఇక ఓపెనర్ గా వచ్చాడు రిషబ్ పంత్. మొదటి సారి వన్డే మ్యాచ్ లో ఓపెనింగ్ దిగాడు పంత్. అయితే తన శైలికి విరుద్ధంగా ఆడుతూ వెళ్ళాడు. కానీ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. 34 బంతులు ఆడిన పంత్ మూడు ఫోర్లతో 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ మరోసారి నిరాశ పరిచాడు. 30 బంతుల్లో 18 పరుగులు చేసి కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు. ఒకే ఓవర్ లో ఓడియన్ స్మిత్ పంత్, కోహ్లీని అవుట్ చేశాడు.
కోహ్లీకి ఈ మ్యాచ్ స్వదేశంలో నూరవ (100) వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ (ఓడీఐ). స్వదేశంలో 100 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడిన ఆటగాళ్లు ఇప్పటి వరకు నలుగురే ఉన్నారు. సచిన్ టెండుల్కర్, మహమ్మద్ అజారుద్దీన్, ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్ కే ఈ రికార్డు సాధ్యమైంది. వీరి సరసన కోహ్లీ కూడా చేరాడు. విరాట్ కోహ్లీ తన కెరీర్ లో ఇప్పటి వరకు 258 వన్డేలు ఆడాడు. దేశీయంగా 19 సెంచరీలు బాదాడు. సచిన్ టెండుల్కర్ దేశీయంగా 164 వన్డేలు ఆడి, 6,976 పరుగులు చేశాడు. సచిన్ స్వదేశంలో 20 శతకాలు సాధించాడు.