భారత్ లో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగానే తమకు బాధకలుగుతోందని.. ట్రావెల్ బ్యాన్ అన్నది పెద్ద సమస్య కాదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ఢిల్లీ కేపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ విజృంభణ కారణంగా భారత్ నుంచి విమానరాకపోకలను ఆస్ట్రేలియా ప్రభుత్వం నిలిపివేయగా.. ట్రావెల్ బ్యాన్ పెద్ద సమస్య కాదని చెప్పుకొచ్చారు. అది చాలా చిన్న విషయమని తేల్చేశారు. విదేశీ ఆటగాళ్లు విమాన రాకపోకల నిషేధం అంశాన్ని మరీ ఎక్కువగా పట్టించుకోవడం లేదని.. భారత్‌లోని ప్రజలు పడుతున్న ఇబ్బందులే తమను తీవ్రంగా కలిచివేస్తున్నాయని అన్నారు.
తాము బయోబబుల్‌లో ఉన్నామని, భారత్‌లోని బయట పరిస్థితులే తీవ్రంగా ఉన్నాయని బాధపడ్డారు. ప్రతీ రోజూ బారత్‌లో కరోనా కేసులు ఎక్కువ నమోదు కావడం ఆందోళన కలిగిస్తోందని.. తమ జట్టులోని రవిచంద్రన్ అశ్విన్ తల్లిదండ్రులకు కరోనా సోకడం లాంటివే ఎక్కువ బాధిస్తున్నాయన్నారు పాంటింగ్. తమ ప్రయాణాల గురించి ఎటువంటి ఆందోళనా లేదన్నారు.