రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆదివారం నాడు చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో భారీ ఓటమిని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే..! ఇంతలో ఆ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు కేన్ రిచర్డ్‌సన్, ఆడం జంపా ఐపీఎల్-2021 నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. తాము స్వదేశానికి వెళ్లిపోతున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఆర్సీబీ ధ్రువీకరించింది.
''వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఆడం జంపా, కేన్ రిచర్డ్‌సన్ ఆస్ట్రేలియాకు వెళ్లిపోతున్నారు. ఈ సీజన్‌లోని మిగతా మ్యాచ్‌లకు వారు అందుబాటులో ఉండరు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం వారి నిర్ణయాన్ని గౌరవిస్తోంది. వారికి ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తుంది'' అని ట్విటర్ వేదికగా అధికారిక ప్రకటన చేసింది. భారత్‌లో ఉన్న ఆటగాళ్లు వెంటనే వెనక్కి రావాలని ఆస్ట్రేలియా సూచించినట్లు సమాచారం. ఇప్పుడు స్వదేశానికి రాకపోతే 3 నెలల పాటు రావడానికి వీల్లేదన్న షరతుల నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వ సూచన మేరకు ఆసీస్ ఆటగాళ్లు భారత్ నుంచి వెనక్కి వెళ్తున్నట్లు తెలుస్తోంది. భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు ప్రపంచ దేశాలను, క్రికెట్ బోర్డులను కూడా కలవరపెడుతున్నాయి.