ఆర్సీబీ వర్సెస్ చెన్నై.. వర్షం పడి మ్యాచ్ రద్దైతే ఏంటి పరిస్థితి?

ఐదుసార్లు ఛాంపియన్‌లుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తమ చివరి లీగ్ స్టేజ్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నాయి.

By M.S.R  Published on  18 May 2024 9:30 AM IST
IPL 2024, RCB vs CSK, rain

ఆర్సీబీ వర్సెస్ చెన్నై.. వర్షం పడి మ్యాచ్ రద్దైతే ఏంటి పరిస్థితి? 

IPL 2024 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్), రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకోగా.. ఐదుసార్లు ఛాంపియన్‌లుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తమ చివరి లీగ్ స్టేజ్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఫైనల్ ప్లేఆఫ్ బెర్త్ కోసం ఈ రెండు జట్లు నేడు తలపడనున్నాయి. చెన్నై జట్టు కొన్ని మ్యాచ్ లలో గెలుస్తూ.. ఇంకొన్ని మ్యాచ్ లను చేజేతులా కోల్పోతూ ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. RCB వరుసగా ఐదు మ్యాచ్‌లలో గెలిచి సత్తా చాటింది. 13 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతో ఆర్‌సీబీ ఆరో స్థానంలో నిలిచింది. ఆఖరి లీగ్ మ్యాచ్ లో ఆర్సీబీ తప్పక గెలవాలి. అంతేకాకుండా ఆ జట్టుకు కొన్ని సమీకరణలు కూడా ఉన్నాయి. చెన్నై కంటే మెరుగైన నెట్ రన్ సాధిస్తేనే ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. చెన్నై జట్టు గెలిస్తే చాలు పాయింట్ల ఆధారంగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది.

బెంగళూరులో శుక్రవారం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇక శనివారం కూడా వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరిక జారీ చేసినందున వాష్ అవుట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. వాష్‌అవుట్ లేదా కుదించబడిన మ్యాచ్ కారణంగా RCB ప్లే ఆఫ్స్ అవకాశాలకు గండి పడే అవకాశం ఉంది. ఫలితం తేలకుంటే రెండు జట్లూ ఒక్కో పాయింట్‌ను పొందుతాయి. అయితే ఓవర్‌లను తగ్గించి మ్యాచ్ నిర్వహిస్తే మాత్రం RCB అనుకున్న NRR చేరుకోవడం చాలా కష్టమవుతుంది. అయితే ఎం చిన్నస్వామి స్టేడియంలో డ్రైనేజ్ వ్యవస్థ అద్భుతంగా ఉండడంతో మ్యాచ్ 20 ఓవర్లు జరుగుతుందనే అభిమానులు ఆశిస్తూ ఉన్నారు. వర్షం పడుతూనే ఉంటే మాత్రం మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు ఉంటాయి. అలా జరగకూడదని సగటు క్రికెట్ అభిమాని తప్పకుండా కోరుకుంటాడు.

Next Story