ఇలాగే రాణిస్తే అతడిని ఎక్కువ కాలం టీమిండియాకు దూరం పెట్టలేరు..!
యువ బ్యాట్స్‌మెన్ దేవదత్ పడిక్కల్ ఐపీఎల్ 2026లో అద్భుతమైన ఫామ్‌ను కనబరుస్తున్నాడు.
By - Medi Samrat |
యువ బ్యాట్స్‌మెన్ దేవదత్ పడిక్కల్ ఐపీఎల్ 2026లో అద్భుతమైన ఫామ్‌ను కనబరుస్తున్నాడు. అతను వరుసగా రెండు అర్ధశతకాలు సాధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌పై 29 బంతుల్లోనే 50 పరుగులు కూడా చేశాడు. దీంతో.. దినేష్ కార్తిక్ అతని గురించి ఒక ముఖ్యమైన అంచనా వేశాడు.
పడిక్కల్ ఇలాగే ఆడుతూ ఉంటే.. అతడిని టీమ్ ఇండియాకు దూరం పెట్టడం కష్టమవుతుందని కార్తీక్ అంటున్నాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ ఐపీఎల్ 2025లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ కూడా అద్భుతంగా రాణించాడు. ఆర్‌సీబీ విజయంలో అతను కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు, బెంగళూరు మెంటార్ కార్తీక్ అతడిని ఎంతగానో ప్రశంసించాడు.
జియోస్టార్‌లో మాట్లాడుతూ కార్తీక్ ఇలా అన్నాడు, "అతనిలో మొదటగా కనిపించే విషయం అతని పట్టుదల. ఆ పిచ్‌పై మొదట్లో పరుగులు రావడం లేదు. చాలా మంది బ్యాట్స్‌మెన్ బలవంతపు షాట్లు ఆడటానికి ప్రయత్నించి వికెట్లు కోల్పోయారు. పరిస్థితులు కష్టంగా ఉన్నప్పుడు, పడిక్కల్ సహనం చూపించి ధైర్యంగా బ్యాటింగ్ చేశాడు. అతను తన మొదటి బౌండరీ కొట్టిన వెంటనే, అతని ఆట శైలి పూర్తిగా మారిపోవడాన్ని మీరు చూడవచ్చు. అతను మంచి క్రికెటింగ్ షాట్లు ఆడుతూ బంతిని అద్భుతంగా కొడుతున్నాడు. అతను ఇలాగే బ్యాటింగ్ కొనసాగిస్తే, అతన్ని ఎక్కువ కాలం టీమ్ ఇండియాకు దూరం పెట్టలేరు. అతను గొప్ప ఆటగాడు, దేశీయ క్రికెట్‌లో కూడా చాలా పరుగులు చేశాడు. అతను డ్రెస్సింగ్ రూమ్‌లో నాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. 25 ఏళ్ల వయసులోనే పడిక్కల్ తన ఆలోచనలు, నాయకత్వంతో జట్టుకు దోహదపడుతున్నాడు. అతన్ని ఇలా చూడటం చాలా ఆనందంగా ఉంది."
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పడిక్కల్ 26 బంతుల్లో 61 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ ఆ మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేసింది. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో 29 బంతుల్లో 50 పరుగులు చేసి, రెండు మ్యాచ్‌లలో మొత్తం 111 పరుగులు చేశాడు.