ఆర్సీబీ హ్యాట్రిక్ విక్టరీ.. చేతులెత్తేసిన నైట్‌రైడర్స్..
RCB Beat Kolkata Knight Riders. ఐపీఎల్-14లో భాగంగా నేడు చెన్నైలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్
By Medi Samrat Published on 18 April 2021 1:58 PM GMT
ఐపీఎల్-14లో భాగంగా నేడు చెన్నైలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘనవిజయం సాదించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగుళూరు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. అయితే.. ఆర్సీబీ బ్యాటింగ్ దిగిన రెండో ఓవర్ రెండో బంతికే కెప్టెన్ కోహ్లీ (5) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత అదే ఓవర్ చివరి బంతికి రజత్ పటీదార్ (1) రూపంలో రెండో వికెట్ కోల్పోయింది.
అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ తొలుత వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించాడు. క్రీజులో కుదురుకున్నాక ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. 49 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 78 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్‌లో హర్భజన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులో ఉన్న డివిలియర్స్ చెలరేగిపోయాడు. 34 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీసుకోగా, పాట్ కమిన్స్, ప్రసీద్ కృష్ణ చెరో వికెట్ తీసుకున్నారు.
అనంతరం ఛేదనకు దిగిన నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మెన్ వరుసగా విఫలమయ్యారు. దీంతో 20 ఓవర్లలో 166 పరుగులకే పరిమితమయ్యి.. 38 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. నితీష్ రాణా 18, శుభమాన్ గిల్ 21, త్రిపాఠి 25, మోర్గాన్ 29, షకీబ్ 26, రస్సేల్ 31 పరుగులు మాత్రమే చేశారు. బెంగుళూరు బౌలర్లలో జెమీసన్ మూడు వికెట్లు, ఛహాల్, హర్షల్ పటేల్ రెండేసీ వికెట్లు, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ చొప్పున పడగొట్టారు. ఈ విషయంతో ఆర్సీబీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకోగా.. నైట్‌రైడర్స్ వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది.