చివరి బంతికి సిక్స్ బాదిన తెలుగు కుర్రాడు.. బెంగళూరు అనూహ్య విజయం
RCB beat Delhi capitals by 7 wickets.165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది బెంగళూరు జట్టు. టాప్ ఫామ్‌లో ఉన్న
By తోట వంశీ కుమార్ Published on 9 Oct 2021 8:02 AM IST165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది బెంగళూరు జట్టు. టాప్ ఫామ్‌లో ఉన్న దేవదత్ పడిక్కల్‌తో పాటు పరుగుల యంత్రం, కెప్టెన్ కోహ్లీ లు జట్టు స్కోరు 6 పరుగులు చేరే సరికి పెవిలియన్ చేరారు. ఈ దశలో తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ (52 బంతుల్లో 78; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్‌తో ఈ సీజన్‌లో అత్యధిక విజయాలతో అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ పై అనూహ్య విజయాన్ని అందించాడు. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఆఖరి బంతిని సిక్స్‌గా మలిచాడు భరత్. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. చేదనలో శ్రీకర్ భరత్‌తో పాటు గ్లెన్ మ్యాక్స్‌వెల్ (33 బంతుల్లో 51 నాటౌట్; 8 ఫోర్లు) లు రాణించడంతో బెంగళూరు 7 వికెట్ల తేడాతో ఢిల్లీని మట్టి కరిపించింది. సోమవారం ఎలిమినేటర్‌లో కోల్‌కతాతో బెంగళూరు అమీతుమీ తేల్చుకోనుంది.
అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టుకు ఆ జట్టు ఓపెనర్లు పృథ్వీ షా (48; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), శిఖర్ ధవన్ (43; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు పోటాపోటిగా బౌండరీలు బాదడంతో 10 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 88 పరుగులతో నిలిచింది. చూస్తుంటే ఢిల్లీ భారీ స్కోర్ చేసేలా కనిపించింది. అయితే.. ఈ దశలో బెంగళూరు బౌలర్లు విజృంభించి ఓపెనర్లతో పాటు కెప్టెన్ రిషబ్‌పంత్ (10) ను స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేర్చారు. అనంతరం కూడా బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు చేసేందుకు ఢిల్లీ బ్యాట్స్‌మెన్లు కష్టపడ్డారు. మిగిలిన వారు విఫలం కాగా.. హెట్‌మైర్ (29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరుగా రాణించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు సాధించింది.
చేధనలో ఓపెనర్లు విరాట్ కోహ్లీ (4), దేవదత్ పడిక్కల్ (0) విఫలమైనా.. భరత్ ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న డివిలియర్స్ (26 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి నిరాశపరిచాడు. అయినప్పటికి స్కోర్ వేగం పడిపోకుండా ఎదురుదాడి చేశాడు భరత్. చక్కటి షాట్లతో అలరించాడు. మాక్స్‌వెల్‌తో కలిసి జట్టును ఆదుకున్నాడు. ఈక్రమంలో 37 బంతుల్లో ఐపీఎల్‌లో తొలి అర్థశతకాన్ని అందుకున్నాడు. 12 బంతుల్లో 19 పరుగులు మాత్రమే చేయాల్సి ఉండగా.. 19 ఓవర్‌లో 4 పరుగులే రావడంతో ఆఖరి ఓవర్‌లో ఆర్‌సీబీ 15 పరుగులు చేయాల్సి వచ్చింది. చివరి బంతికి ఆరు పరుగులు చేయాలి. అయితే.. ఆరో బంతిని బౌలర్ ఆవేశ్ ఖాన్ వైడ్ వేయడంతో ఒక బంతికి ఐదు పరుగులుగా సమీకరణం మారింది. కొంచెం ఎత్తులో వచ్చిన పుల్‌టాస్‌ను భరత్.. బౌలర్ తల మీదుగా సిక్స్ కొట్టి బెంగళూరుకు ఊహించని విజయాన్ని అందించాడు.