వారెవ‌రూ ప్రపంచకప్‌ను గెలవలేకపోయారు.. సచిన్ కూడా ఆరు ప్రపంచకప్‌లు ఆడాల్సి వచ్చింది..

Ravi Shastri says Sourav Ganguly Rahul Dravid VVS Laxman havent won world cup. టీమిండియా మాజీ ఆట‌గాళ్ల‌పై మాజీ కోచ్‌ రవిశాస్త్రి కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు.

By Medi Samrat  Published on  25 Jan 2022 1:28 PM IST
వారెవ‌రూ ప్రపంచకప్‌ను గెలవలేకపోయారు.. సచిన్ కూడా ఆరు ప్రపంచకప్‌లు ఆడాల్సి వచ్చింది..

టీమిండియా మాజీ ఆట‌గాళ్ల‌పై మాజీ కోచ్‌ రవిశాస్త్రి కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. గంగూలీ, ద్రవిడ్, లక్ష్మణ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. టీ20 ప్రపంచకప్ తర్వాత రవిశాస్త్రి తప్పుకున్నాడు. ఆయ‌న కోచ్‌గా ఉన్న‌ప్పుడు టీమ్ విదేశాల్లో బాగా ఆడింది. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌ను కూడా జట్టు గెలుచుకుంది. రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ జోడీ కూడా బాగా కుదిరింది. కానీ కెప్టెన్‌గా కోహ్లీ ఐసీసీ టోర్నీని గెలవలేకపోయాడు. దక్షిణాఫ్రికాపై ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ, టెస్టు కెప్టెన్సీ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.

ఈ విష‌య‌మై రవిశాస్త్రి ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. గత కొన్నేళ్లుగా కొంతమంది అనుభవజ్ఞులు ప్రపంచకప్‌ను గెలవలేకపోయారని ఆయన అన్నారు. సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, రోహిత్ శర్మ కూడా ప్రపంచకప్ గెలవలేకపోయారు. అలా అని అత‌ను(కోహ్లీ) చెడ్డ ఆటగాడని కాదు.. ''సచిన్ టెండూల్కర్ కూడా గెలవడానికి ముందు ఆరు ప్రపంచకప్‌లు ఆడాల్సి వచ్చిందని వ్యాఖ్యానించాడు. నేను జట్టుతో 7 సంవత్సరాలు ఉన్నాను.. ప్ర‌స్తుతం 3 నెలలు విశ్రాంతి తీసుకోబోతున్నాను. నేను ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ గురించి మాట్లాడతాను. అప్పుడు జరిగిన దాని గురించి నేను మాట్లాడదలచుకోలేదు. ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్ప‌గ‌ల‌ను.. నేను బహిరంగ ప్రదేశాల్లో మురికి బట్టలు ఉతకను. నేను నా ఆటగాళ్లలో ఎవరి గురించి బహిరంగ చర్చను కోరుకోవడం లేదంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

భారత దక్షిణాఫ్రికా పర్యటన సెంచూరియన్‌లో విజయంతో ప్రారంభమైంది, అయితే పర్యటనలో భారత్‌కు ఇది ఏకైక విజయం. టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా.. చివరి రెండు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా గెలిచి 2-1 సిరీస్ కైవ‌సం చేసుకుంది. అలాగే వన్డే సిరీస్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం కేప్‌టౌన్‌లో జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత జట్టు విజయానికి అతి చేరువైంది. అయితే కేవలం 4 పరుగుల తేడాతో భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.


Next Story