Video : ఒకే ఓవ‌ర్లో 37 ప‌రుగులిచ్చిన టీమిండియా కెప్టెన్‌..!

హాంకాంగ్ సిక్సెస్‌లో సిక్స‌ర్ల మోత మోగుతుంది. 14 బంతుల్లో 53 పరుగుల రవి బొపారా అజేయ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ 15 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది

By Medi Samrat  Published on  2 Nov 2024 2:51 PM IST
Video : ఒకే ఓవ‌ర్లో 37 ప‌రుగులిచ్చిన టీమిండియా కెప్టెన్‌..!

హాంకాంగ్ సిక్సెస్‌లో సిక్స‌ర్ల మోత మోగుతుంది. 14 బంతుల్లో 53 పరుగుల రవి బొపారా అజేయ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ 15 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. భారత కెప్టెన్ రాబిన్ ఉతప్ప వేసిన ఓవర్లో బొపారా 6 సిక్సర్లు బాదాడు. ఈ ఓవర్‌లో ఉతప్ప 1 వైడ్‌తో సహా 37 పరుగులు ఇచ్చాడు. హాంకాంగ్ సిక్సెస్‌లో భారత్‌కు ఇది వరుసగా మూడో ఓటమి. అంతకుముందు పాకిస్థాన్, యూఏఈలు భారత జట్టును ఓడించాయి.

ఈ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 6 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 120 పరుగులు చేసింది. అనంత‌రం భారత జట్టు 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు కెప్టెన్‌ రవి బొపారా అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. బొపారా 14 బంతుల్లో 378.57 స్ట్రైక్ రేట్‌తో 53 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు బాదిన‌ బొపారా త‌ర్వాత‌ రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. ఇంగ్లండ్‌ ఓపెనర్‌ సమిత్‌ పటేల్‌ కూడా హాఫ్‌ సెంచరీ చేశాడు. సమిత్‌ 18 బంతులు ఎదుర్కొని వేగంగా 51 పరుగులు చేశాడు. సమిత్ ఇన్నింగ్సులో 4 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. సమిత్ పటేల్ కూడా రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. 8 పరుగుల వద్ద అలెక్స్ డేవిస్ రనౌట్ అయ్యాడు. జోర్డాన్ థాంప్సన్ 1 బంతికి 6 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత్ నుంచి ఏ బౌలర్‌కు వికెట్ దక్కలేదు.


121 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు రెండో ఓవర్‌లోనే తొలి దెబ్బ తగిలింది. భరత్ చిప్లి 7 బంతుల్లో 21 పరుగులు చేసి అవుట‌య్యాడు. ఆ తర్వాతి బంతికే కెప్టెన్ రాబిన్ ఉతప్ప గోల్డెన్ డక్‌కి గురయ్యాడు. మూడో ఓవర్‌లో స్టువర్ట్ బిన్నీ(5) బౌల్డ్ అయ్యాడు. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శ్రీవత్స్ గోస్వామి 10 బంతుల్లో 27 పరుగులతో, కేదార్ జాదవ్ 15 బంతుల్లో 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. కేదార్ జాదవ్ 4 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు.రవి బొపారా 2 వికెట్లు ద‌క్క‌గా.. జోర్డాన్ థాంప్సన్ 1 వికెట్ తీశాడు.

Next Story