కాబుల్ పేలుళ్ల‌పై ర‌షీద్ ఖాన్ భావోద్వేగం.. చంపడం ఆపండి ప్లీజ్‌

Rashid Khan and Mohammed Nabi heartbroken over Kabul blasts. కాబుల్‌లోని హ‌మీద్ క‌ర్ణాయ్ అంత‌ర్జాతీయ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Aug 2021 3:41 PM IST
కాబుల్ పేలుళ్ల‌పై ర‌షీద్ ఖాన్ భావోద్వేగం.. చంపడం ఆపండి ప్లీజ్‌

కాబుల్‌లోని హ‌మీద్ క‌ర్ణాయ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం వెలుప‌ల గురువారం సాయంత్రం జంట పేలుళ్లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ పేలుళ్ల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 103 మంది చ‌నిపోయారు. 13 మంది అమెరికా సైనికులు చ‌నిపోగా.. 90 మంది అఫ్గాన్ ప్ర‌జ‌లు మ‌ర‌ణించారు. 150 మందికి పైగా గాయ‌ప‌డిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. కాగా.. ఈ పేలుళ్ల‌పై అఫ్గానిస్థాన్ క్రికెట‌ర్లు ర‌షీద్ ఖాన్‌, మ‌హ్మ‌ద్ న‌బీ స్పందించారు. తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కాబూల్ మ‌ళ్లీ ర‌క్త‌మోడుతోంది. ఆఫ్ఘ‌న్ల‌ను ద‌య‌చేసి చంప‌డం ఆపండి అంటూ ర‌షీద్ ఖాన్ ట్విట‌ర్ వేదిక‌గా ట్వీట్ చేశాడు. కన్నీళ్లు చిందిస్తున్న ఏమోజీలతో పాటు గుండె పగిలిన ఏమోజీలను ట్వీట్‌కు జత చేశాడు.

ఈ దాడిని మ‌రో క్రికెట‌ర్, ఆల్‌రౌండ‌ర్ అయిన మ‌హ్మ‌ద్ న‌బీ ఖండించారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. ఇలాంటి క‌ష్ట స‌మ‌యంలో ఆఫ్ఘ‌న్లు ఆదుకొని సాయం చేయాల‌ని ప్ర‌పంచాన్ని కోరుతున్న‌ట్లు ట్వీట్ చేశాడు.

ప్రస్తుతం రషీద్‌ ఖాన్ ఇంగ్లాండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో ఆడుతున్నాడు. ససెక్స్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. యార్క్‌షైర్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సిక్స‌ర్లు, ఫోర్ల‌తో దంచికొట్టాడు. 9 బంతుల‌ను ఎదుర్కొన్న ర‌షీద్‌.. మూడు ఫోర్లు, రెండు సిక్సర్ల బాది 27 పరుగులు సాధించాడు.

Next Story