హైదరాబాద్ బ్యాటర్ సంచలనం.. 147 బంతుల్లో ట్రిపుల్‌ సెంచరీ

హైదరాబాద్ బ్యాటర్ తన్మయ్ అగర్వాల్ అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన రంజీ ట్రోఫీలో రౌండ్-ఫోర్ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

By Srikanth Gundamalla  Published on  26 Jan 2024 7:15 PM IST
ranji trophy-2024, hyderabad, batter tanmay, record,

హైదరాబాద్ బ్యాటర్ సంచలనం.. 147 బంతుల్లో ట్రిపుల్‌ సెంచరీ

హైదరాబాద్ బ్యాటర్ తన్మయ్ అగర్వాల్ అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన రంజీ ట్రోఫీలో రౌండ్-ఫోర్ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఉత్కంఠభరితమైన నాక్‌తో ప్రపంచ రికార్డు సృష్టించాడు. తన్మయ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీని బాదాడు. హైదరాబాద్‌లోని నెక్స్‌జెన్ క్రికెట్ గ్రౌండ్‌లో ఈ చారిత్రాత్మక ఫీట్ సాధించాడ. అతను ఆడుతున్నంత సేపు గ్రౌండ్‌ వద్ద ఉన్న ప్రేక్షకులు ఫుల్‌ ఎంజాయ్‌ చేశారు.

రంజీ ట్రోఫీ 2023- 24 సీజన్‌లో తన్మయ్‌ సంచలనం సృష్టించాడు. అరుణాచల్‌ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో ట్రిపుల్‌ సెంచరీతో చెలరేగాడు. తన్మయ్ కేవలం 147 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అత్యంత వేగంగా ట్రిపుల్‌ సెంచరీ బాదిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.

కాగా.. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అరుణాచల్‌ ప్రదేశ్‌ టీమ్‌ 39.4 ఓవర్లలో 172 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగింది హైదరాబాద్ టీమ్. ఓపెనర్లుగా వచ్చిన తన్మయ్‌ అగర్వాల్, రాహుల్‌ సింగ్‌ ఇద్దరూ రాణించారు. కాగా.. రాహుల్‌ సింగ్ హైదరాబాద్‌ టీమ్ కెప్టెన్. తన్మయ్‌ 160 బంతుల్లో 323 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రాహుల్‌సింగ్ మాత్రం 105 బంతుల్లో 185 పరుగులు చేసి ఔట్‌ అయ్యాడు. కాగా.. తన్మయ్‌ ఇన్నింగ్స్‌లో 33 బౌండరీలు ఉండగా.. 21 సిక్స్‌లు ఉన్నాయి. 48 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి 529 పరుగులు చేసింది హైదరాబాద్. తద్వారా 357 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఆల్‌టైమ్‌ రికార్డు నమోదు

అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిసిన తన్మయ్‌ అగర్వాల్‌ సౌతాఫ్రికా క్రికెటర్‌ మార్కో మరేస్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌ బార్డర్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన మార్కో. ఈస్టర్న్ ప్రావిన్స్ మీద 191 బంతుల్లో 300 పరుగులు చేశాడు. అయితే.. తాజాగా ఆ రికార్డును బ్రేక్‌ చేశాడు తన్మయ్. కేవలం 147 బంతుల్లోనే 300 పరుగులను రాబట్టాడు.

Next Story