రంజీ మ్యాచ్‌ల‌లో స‌త్తా చాటిన భువనేశ్వర్ కుమార్‌, మయాంక్ అగర్వాల్, అర్జున్ టెండూల్కర్

2023-24 రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ మ్యాచ్‌ల‌లో చాలా మంది టీమిండియా ఆటగాళ్లు మంచి ప్రదర్శన కనబరిచారు.

By Medi Samrat  Published on  13 Jan 2024 9:00 PM IST
రంజీ మ్యాచ్‌ల‌లో స‌త్తా చాటిన భువనేశ్వర్ కుమార్‌, మయాంక్ అగర్వాల్, అర్జున్ టెండూల్కర్

2023-24 రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ మ్యాచ్‌ల‌లో చాలా మంది టీమిండియా ఆటగాళ్లు మంచి ప్రదర్శన కనబరిచారు. తిరిగి ఫామ్‌లోకి వచ్చామ‌న్న‌ సంకేతాలను చూపించారు. ఇదే సమయంలో కొంతమంది యువ ఆటగాళ్లు కూడా నిలకడగా రాణిస్తూ జాతీయ జట్టులోకి ఎంపిక చేయాల‌నే తమ వాదనను బలంగా వినిపిస్తున్నారు. భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్ వంటి ఆటగాళ్లు తమ ప్రదర్శనతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. అదే సమయంలో అర్జున్ టెండూల్కర్ లాంటి యువ ఆటగాళ్ల ప్రదర్శన కూడా చర్చనీయాంశమైంది.

భువనేశ్వర్ కుమార్ రంజీ ట్రోఫీలో పునరాగమనం చేసి బెంగాల్ టాప్ ఆర్డర్‌ను దెబ్బ తీశాడు. అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 13వ సారి ఐదు వికెట్లు పడగొట్టాడు. 60 పరుగులకే ఆలౌట్ అయిన తర్వాత UP జట్టు పునరాగమనం చేయడంలో త‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో సహాయపడ్డాడు. కాన్పూర్‌లో ఉత్తరప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌ కేవలం 20.5 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది. బెంగాల్ తరఫున మహమ్మద్ షమీ తమ్ముడు మహమ్మద్ కైఫ్ 5.5 ఓవర్లలో 14 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంత‌రం యూపీ త‌రుపున భువనేశ్వర్ 22 ఓవర్లలో 41 పరుగులిచ్చి ఎనిమిది వికెట్లు తీయడంతో బెంగాల్ జట్టు 188 పరుగులకు ఆలౌటైంది. మహ్మద్ కైఫ్ కూడా బ్యాట్‌తో రాణించి 45 పరుగులు చేశాడు.

గోవా, చండీగఢ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ తన బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. 60 బంతుల్లో 70 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో అర్జున్ 116 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. అదే ఇన్నింగ్స్‌లో 197 పరుగులు చేసిన సుయ్యష్ ప్రభుదేశాయ్ స్ట్రైక్ రేట్ 54 మాత్రమే కావ‌డం విశేషం. దీన్ని బట్టి అర్జున్ దూకుడు ఏపాటిదో అంచనా వేయవచ్చు.

కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ కూడా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి 109 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. మయాంక్ ఇన్నింగ్స్ కారణంగా ఈ మ్యాచ్‌లో కర్ణాటక జట్టు గణనీయమైన ఆధిక్యం సాధించడంలో సఫలమైంది. మయాంక్‌తో పాటు మనీష్ పాండే కూడా బాగా బ్యాటింగ్ చేసి జట్టు స్కోరును 300 పరుగులు దాటించడంలో విశేషంగా సహకరించాడు.

Next Story