త్వరలోనే బీసీసీఐ ఉపాధ్యక్ష పదవికి రాజీవ్ శుక్లా రాజీనామా.!

Rajiv Shukla will resign from the post of BCCI Vice President soon. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా రాజ్యసభ ఎంపీగా నియమితుడైన విషయం

By అంజి  Published on  19 July 2022 1:59 PM GMT
త్వరలోనే బీసీసీఐ ఉపాధ్యక్ష పదవికి రాజీవ్ శుక్లా రాజీనామా.!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా రాజ్యసభ ఎంపీగా నియమితుడైన విషయం తెలిసిందే. అయితే త్వరలోనే రాజీవ్‌ శుక్లా బీసీసీఐ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ప్రజా సేవలో ఉండే వ్యక్తి బోర్డులో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడానికి అవకాశం ఉండదు. 2020 డిసెంబర్‌ నుంచి రాజీవ్‌ శుక్లా బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అతను ఆ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే శుక్లా ఇటీవలే ఛత్తీస్గఢ్‌ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో ఆయన నిబంధనల ప్రకారం బీసీసీఐ ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంది.

''నిబంధనల ప్రకారం శుక్లా తన పదవి నుంచి వైదొలగాలి. అయితే ఈ విషయమై చర్చించడానికి గాను బోర్డు ఆఫీసర్లు అంతా ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్నారు. శుక్లా రాజ్యసభ పనుల్లో బిజీగా ఉన్నారు. కానీ ఈ గురువారం నిర్వహించబోయే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయమై ప్రకటన వెలువడే అవకాశముంది'' అని బీసీసీఐ కి చెందిన ఓ అధికారి వెల్లడించారు. శుక్లా కూడా అపెక్స్ కౌన్సిల్ సభ్యుడే. ఆయన కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశముంది.

మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సహా 28 మంది ఎంపీలతో కలిసి రాజీవ్ శుక్లా సోమవారం రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు ఆయన ఆరేళ్లపాటు రాజ్యసభలో కొనసాగనున్నారు. రాబోయే రోజుల్లో శుక్లా తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించనున్నారని బీసీసీఐ అధికారి ఒకరు ధృవీకరించారు.

"ఒక వ్యక్తి మంత్రి లేదా ప్రభుత్వ సేవకుడిగా లేదా ప్రభుత్వ కార్యాలయంలో పని చేస్తున్నట్లయితే, బోర్డులో ఆఫీస్-బేరర్, గవర్నింగ్ కౌన్సిల్ లేదా ఏదైనా కమిటీ లేదా ఏదైనా సారూప్య సంస్థ సభ్యుడిగా ఉండటానికి అనర్హుడవుతాడు" అని బీసీసీఐ రాజ్యాంగం చెబుతోంది.

ప్రస్తుతం భారత క్రికెట్ బోర్డుకు సౌరవ్ గంగూలీ (అధ్యక్షుడు) నేతృత్వం వహిస్తుండగా, జయ్ షా ప్రస్తుత కార్యదర్శిగా ఉన్నారు.

Next Story