ఆర్సీబీకి కొత్త కెప్టెన్ వ‌చ్చేశాడు.. బ్యాక్‌ గ్రౌండ్ ఇదే..!

ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రజత్ పాటిదార్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

By Medi Samrat  Published on  13 Feb 2025 2:45 PM IST
ఆర్సీబీకి కొత్త కెప్టెన్ వ‌చ్చేశాడు.. బ్యాక్‌ గ్రౌండ్ ఇదే..!

ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రజత్ పాటిదార్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రజత్ పటీదార్‌ను కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు ఆర్‌సీబీ గురువారం ప్రకటించింది. RCB తన సోషల్ మీడియా హ్యాండిల్స్, లైవ్ సెషన్ ద్వారా 31 ఏళ్ల రజత్ పాటిదార్‌ను కెప్టెన్‌గా నియమించింది. రజత్ పాటిదార్ RCBకి ఎనిమిదో కెప్టెన్ అయ్యాడు. దీనికి ముందు.. ఫాఫ్ డు ప్లెసిస్ మూడు సీజన్లకు ఫ్రాంచైజీకి నాయకత్వం వహించాడు. ఆర్సీబీ ఒక్కసారి కూడా ఐపీఎల్‌ టైటిల్‌ గెలవలేదు. రజత్ పాటిదార్ నాయకత్వంలో.. టైటిల్ కరువును ముగించాలని ఫ్రాంచైజీ భావిస్తోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన రజత్ పాటిదార్.. తొలిసారి ఐపీఎల్ టైటిల్‌ను ఆర్‌సీబీ నెగ్గేలా చేస్తాడ‌ని అభిమానులు కూడా భావిస్తున్నారు.

31 ఏళ్ల రజత్ పాటిదార్‌కు రాష్ట్ర జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం ఉంది. అతడు 2019 నుండి 2024 వరకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌కు నాయకత్వం వహించాడు. ఈ కాలంలో పాటిదార్ కెప్టెన్‌గా 12 మ్యాచ్‌లు గెలుపొందగా.. నాలుగింటిలో ఓటమిని ఎదుర్కొన్నాడు. రజత్ త‌న‌ కెప్టెన్సీతో మధ్యప్రదేశ్‌ను 2024-25 SMAT ఫైనల్‌కు తీసుకెళ్లాడు,. అక్కడ ముంబై చేతిలో ఓడిపోయింది. 2024-25 SMATలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రజత్ పాటిదార్ నిలిచాడు. ర‌జ‌త్ 9 ఇన్నింగ్స్‌లలో 61.14 సగటుతో 428 పరుగులు చేశాడు.

IPL 2021లో RCB తరపున రజత్ పాటిదార్ అరంగేట్రం చేశాడు. అప్పటి నుండి రజత్ పాటిదార్ 27 మ్యాచ్‌లలో ఆడి 34.74 సగటు, 158.85 స్ట్రైక్ రేట్‌తో 799 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఏడు అర్ధ సెంచరీలు చేశాడు. రజత్ పాటిదార్‌కు 2024 ఐపీఎల్‌ అత్యుత్తమ సీజన్.. ఈ సీజ‌న్‌లో 15 మ్యాచ్‌ల్లో 5 అర్ధ సెంచరీల సహాయంతో 395 పరుగులు చేశాడు. సగటు 30.38 కాగా స్ట్రైక్ రేట్ 177.13. అత్యుత్తమ స్కోరు 55 పరుగులు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జూన్ 1, 1993లో జన్మించిన రజత్ పాటిదార్‌ భారత్ తరఫున మూడు టెస్టులు, ఒక వన్డే ఆడే అవకాశం లభించింది. మూడు టెస్టుల్లో ఆరు ఇన్నింగ్స్‌లలో 63 పరుగులు చేశాడు. అత్యుత్తమ స్కోరు 32 పరుగులు. ఒక వన్డేలో 22 పరుగులు చేశాడు.

రజత్ పాటిదార్ 68 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 13 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీల సహాయంతో 4,738 పరుగులు చేశాడు. లిస్ట్ ఎ క్రికెట్‌లో పాటిదార్ 64 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీల సాయంతో 2,211 పరుగులు చేశాడు. 75 టీ20 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, 24 హాఫ్ సెంచరీల సాయంతో 2,463 పరుగులు చేశాడు.

ఇప్ప‌టివ‌ర‌కూ RCB కెప్టెన్‌లు వీరే..

రాహుల్ ద్రవిడ్ - 2008-2008

కెవిన్ పీటర్సన్ - 2009-2009

అనిల్ కుంబ్లే - 2009-2010

డేనియల్ వెట్టోరి - 2011-2012

విరాట్ కోహ్లీ - 2011-2023

షేన్ వాట్సన్ - 2017-2017

ఫాఫ్ డు ప్లెసిస్ - 2022-2024

రజత్ పాటిదార్ - 2025*

Next Story