కోహ్లీ, గంభీర్ మధ్య గొడవను పరిష్కరించింది నేనే..!
టీమిండియాకు చెందిన స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, కోచ్ గౌతమ్ గంభీర్ ఇటీవల సరదాగా మాట్లాడుకుంటున్నారు.
By Medi Samrat Published on 31 Jan 2025 3:35 PM IST
టీమిండియాకు చెందిన స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, కోచ్ గౌతమ్ గంభీర్ ఇటీవల సరదాగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ ఇద్దరూ గతంలో మైదానంలో చాలాసార్లు గొడవపడ్డారు. 2023 ఐపీఎల్‌లో కూడా వీరిద్దరి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఇంతకు ముందు కూడా వీరిద్దరూ ఐపీఎల్‌లో చాలాసార్లు మైదానంలోనే ఘర్షణ పడ్డారు. అయితే కోహ్లీ, గంభీర్ మధ్య పోరు తన వల్లే సద్దుమణిగిందని ఢిల్లీ తరఫున ఆడిన మాజీ ఆటగాడు చెప్పాడు.
2023లో గంభీర్ లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా ఉండగా.. ఆర్సీబీకి చెందిన కోహ్లీతో గొడవపడ్డాడు. 2013లో గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూడా మైదానంలో కోహ్లీతో గొడవపడ్డాడు. అప్పుడు కూడా కోహ్లి RCBలో ఉన్నాడు. ఆ సమయంలో ఢిల్లీ జట్టులో వీరిద్దరితో కలిసి ఆడిన రజత్ భాటియా కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్నాడు. ఆ సమయంలో వారి గొడవను పరిష్కరించింది తానేనని రజత్ చెప్పాడు.
2013లో జరిగిన గొడవ తర్వాత కోహ్లి, గంభీర్‌ల మధ్య సయోధ్య కుదిరింది కాబట్టే ప్రజలకు తన గురించి తెలుసునని రజత్ భాటియా ఢిల్లీ, రైల్వేస్ మధ్య మ్యాచ్ వేళ అన్నాడు. రజత్ మాట్లాడుతూ.. "గంభీర్, కోహ్లి మధ్య జరిగిన పోరును నేను ముగించాను.. కాబట్టి ప్రజలు నన్ను ఎక్కువగా తెలుసుకున్నారు. నా ఆట కంటే.. ఈ గొడవ పరిష్కరించిన కారణంగానే నేను జనాలకు ఎక్కువ తెలుసు.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గంభీర్ పేరుతో ఒక స్టాండ్, విరాట్ కోహ్లీ పేరు మీద పెవిలియన్ ఉన్నాయి. ఈరోజు టీమ్ ఇండియాలో ఇద్దరూ కలిసి ఉన్నారు. గంభీర్ జట్టుకు ప్రధాన కోచ్.. కోహ్లి జట్టులో ముఖ్యమైన సభ్యుడు అని వ్యాఖ్యానించాడు.
ప్రతి జట్టులోనూ కొన్ని అభిప్రాయ భేదాలు ఉంటాయని రజత్ భాటియా అన్నాడు. "ప్రతి జట్టులో చిన్న చిన్న వివాదాలు జరుగుతుంటాయి. గతంలో ఢిల్లీ రంజీ జట్టులో కూడా ఉండేవి, కానీ వాటిని కొనసాగించాల్సిన అవసరం లేదు, ఈ రోజు ఒకరు ప్రధాన కోచ్.. మరొకరు జట్టులో ముఖ్యమైన భాగం" అని అతను చెప్పాడు.
కాగా.. 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలోకి పునరాగమనం చేసిన కోహ్లి.. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించలేకపోయాడు. అతను ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హిమాన్షు సాంగ్వాన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.