IPL 2025 లో మరో యువ క్రికెటర్ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టనున్నాడు. రియాన్ పరాగ్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. తొలి మూడు మ్యాచ్ లకు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా సంజు శాంసన్ స్థానంలో రియాన్ పరాగ్ వ్యవహరిస్తారని జట్టు మేనేజ్మెంట్ ప్రకటించింది. గాయంతో సంజు శాంసన్ ఇంకా కోలుకోకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తుంది. శాంసన్ పూర్తిగా కోలుకునే వరకు పరాగ్ రాజస్థాన్ జట్టును నడిపిస్తాడు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుండి సంజు శాంసన్ కు పూర్తి స్థాయిలో వికెట్ కీపింగ్ చేయడానికి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో అతను పూర్తి ఫిట్ నెస్ సాధించేవరకు కేవలం బ్యాటర్ గానే అందుబాటులోనే ఉండనున్నాడు. ఈ సీజన్ లో ప్రారంభ మ్యాచ్ లకు ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగనున్నాడు.
ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన T20I సిరీస్ సమయంలో శాంసన్ తన కుడి చూపుడు వేలికి తగిలిన గాయం నుండి కోలుకుంటున్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్ దాని కోసం శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చింది. అయితే ముంబైలో జరిగే ఐపీఎల్ కెప్టెన్ల సమావేశంలో శాంసన్ రాజస్థాన్ రాయల్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తాడు.