అశ్విన్ టాప్.. రోహిత్ ర్యాంకు ఎంతంటే.?

టెస్టు క్రికెట్‌లో వరల్డ్‌ నెంబర్‌ వన్‌ బౌలర్‌గా టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ నిలిచాడు.

By Medi Samrat  Published on  13 March 2024 6:47 PM IST
అశ్విన్ టాప్.. రోహిత్ ర్యాంకు ఎంతంటే.?

టెస్టు క్రికెట్‌లో వరల్డ్‌ నెంబర్‌ వన్‌ బౌలర్‌గా టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ నిలిచాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అశ్విన్‌ అగ్రస్ధానానికి చేరుకున్నాడు. ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన అశ్విన్.. జస్ప్రీత్ బుమ్రాను వెనక్కినెట్టి టాప్‌ ర్యాంక్‌ను చేరుకున్నాడు. అశ్విన్‌ తన కెరీర్‌లో ఫస్ట్‌ ర్యాంక్‌ను సాధించడం ఇది ఆరోసారి. 2015 డిసెంబర్‌లో తొలిసారి టాప్‌ ర్యాంక్‌ను అశ్విన్ సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌ సిరీస్‌లో 26 వికెట్లు పడగొట్టాడు అశ్విన్‌. కుల్దీప్‌ 15 స్థానాలు ఎగబాకి 16వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. టాప్‌ ర్యాంక్‌లో కొనసాగిన బుమ్రా.. మూడో స్ధానానికి పడిపోయాడు. హేజిల్‌వుడ్ రెండో స్థానంలో నిలిచాడు.

టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు. టాప్-10 బ్యాట్స్‌మెన్ల జాబితాలోకి దూసుకొచ్చి 8వ ర్యాంకులో నిలిచాడు. విరాట్ కోహ్లీని కూడా అధిగమించాడు. విరాట్ ప్రస్తుతం 9వ స్థానానికి దిగజారాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏకంగా 5 స్థానాలు ఎగబాకి 6వ ర్యాంకులో నిలిచాడు. ఐసీసీ టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో నిలిచాడు. భారత్‌తో సిరీస్‌లో రాణించిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్ రెండో ర్యాంక్‌లో నిలిచాడు. బాబర్ ఆజమ్ 3వ స్థానం, కివీస్ బ్యాట్స్‌మెన్ డారిల్ మిచెల్ 4వ ర్యాంకులో నిలిచారు. స్టీవ్ స్మిత్ ఐదో స్థానంలో ఉన్నాడు.

Next Story