జట్టు కోసం నిస్వార్థంగా ఆడే ఇలాంటి ఆటగాడు దొరకడం కష్టం : అశ్విన్
BCCI సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్ ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును ప్రకటించారు.
By Medi Samrat
BCCI సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్ ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును ప్రకటించారు. అయితే ఈ జట్టు ఎంపిక అనేక ప్రశ్నలను లేవనెత్తింది. యువ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్‌ను తొలగించడం అత్యంత ఆశ్చర్యకరమైన నిర్ణయం. మరోవైపు శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేసి వైస్ కెప్టెన్ బాధ్యతలు కూడా అప్పగించారు. భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ కూడా యశస్వి డ్రాప్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
యశస్వి జైస్వాల్ T20 ప్రపంచ కప్ 2024లో భారత బ్యాకప్ ఓపెనర్‌గా స్థానం సంపాదించాడు. కానీ, ఇప్పుడు అకస్మాత్తుగా ఆసియా కప్‌కు భారత జట్టులో అతనిని చేర్చకుండా అందరినీ ఆశ్చర్యపరిచారు సెలక్టర్లు. ఈ నిర్ణయం అతని కెరీర్‌పై చాలా ప్రభావం చూపనుంది.
టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన తర్వాత.. అతడు నిలకడగా అద్భుతంగా ఆడాడు. ఇటీవలి కాలంలో టీమిండియా అత్యంత విజయవంతమైన యువ బ్యాట్స్‌మెన్‌గా నిరూపించుకున్నాడు. టెస్టు అయినా, టీ20 అయినా ప్రతి సందర్భంలోనూ తనేంటో నిరూపించుకున్నాడు. అయితే ఇప్పుడు జట్టుకు దూరంగా ఉంచడం అతనికి పెద్ద దెబ్బ.
అనుభవజ్ఞుడైన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ ఎంపికపై తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో.. జైస్వాల్‌ను జట్టు నుండి తీసివేయడం అతని ఆట తీరుపై ప్రభావం చూపుతుందని అశ్విన్ చెప్పాడు. అశ్విన్ మాట్లాడుతూ.. ఇప్పుడు యశస్వి జట్టు కోసం ఆడకుండా.. తన కోసం ఆడటం ప్రారంభించే అవకాశం ఉంది. ఇది అతని నైతికతను ప్రభావితం చేయవచ్చు.. జైస్వాల్‌కు టెస్టు క్రికెట్‌లో అవకాశం రాగానే రెండు చేతులా దగ్గరకు తీసుకున్నానని అశ్విన్ చెప్పాడు. మీరు అతడికి ఆడటానికి ఏ ఫార్మాట్‌లో అవకాశం ఇచ్చినా.. అతడు అద్భుతంగా రాణించాడు. కానీ అతనికి అవకాశం రాలేదు. జైస్వాల్ టీ20 స్ట్రైక్ రేట్ (165) గురించి ప్రస్తావిస్తూ.. జట్టు కోసం నిస్వార్థంగా ఆడే ఆటగాళ్లు దొరకడం కష్టమని అన్నాడు. చాలా మంది బ్యాట్స్‌మెన్ తమ సగటు.. నెంబర్లు కాపాడుకోవడానికి ఆడతారు. కానీ యశస్వి ఎల్లప్పుడూ స్పాట్‌లో షాట్లు ఆడుతాడు.. జట్టుకు ప్రాధాన్యత ఇస్తాడు. అయినప్పటికీ అతనిని మినహాయించడం చాలా దురదృష్టకరం. T20 ఇప్పుడు ఆటగాళ్ళు తమ స్థానాలను కాపాడుకోవడానికి ఆడే ఫార్మాట్‌గా మారిందని ఇది చూపిస్తుందని అసహనాన్ని వ్యక్తం చేశాడు.